Suspension : ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్
Suspension : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైసీపీకి విధేయంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై వేటుపడింది. సెట్ బృందంలోని అప్పటి నెల్లూరు ఎస్పీ ఇచ్చిన నివేదిక మేరకు ఇద్దరు సీఐలు, మరో ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఘటనలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు సీఐలు, ఓ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ను సస్నెండ్ చేశారు.
2021లో జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో తిరుపతి జగన్మాత స్కూల్ లో దొంగ ఓటరు స్లిప్పులతో వచ్చిన వచ్చిన ఓ వ్యక్తిని బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి పట్టుకొని అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ కు అప్పగించారు. మరికొన్ని ఘటనలపైన కేసులు నమోదైనా ఏడాదిపాటు వదిలేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన సీఐ అబ్బన్న దర్యాప్తులో నిర్లక్ష్యం చూపారు. కొంతకాలం తర్వాత మూసివేశారు. దీంతో వీరిద్దరినీ సస్పెండ్ చేశారు.
దొంగ ఓటర్లు గుంపులుగా పోలింగ్ బూత్ లోకి వచ్చారని టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఓ వీడియో ఆధారంతో తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై నాగేంద్రబాబు కేసు నమోదు చేసి గుర్తు తెలియని వ్యక్తులుగా తేల్చి కేసు మూసివేశారు. చిత్తూరు నుంచి తిరుపతికి బస్సులో వస్తున్న మహిళా దొంగ ఓటర్ల వీడియోను టీడీపీ నాయకులు ఎస్వీయూ పోలీసులకు ఇచ్చారు. దీనిపై ఎస్సై సుమతి కేసు నమోదు చేసి గుర్తు తెలియని మహిళలుగా పేర్కొంటూ కేసు మూసివేశారు. దీంతో ఈ ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేశారు.