Chandragiri DSP : చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ ను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఎన్నికల సమయంలో చంద్రగిరిలో జరిగే ఘటనలను ముందస్తుగా పసిగట్టి నిలువరించడం, ఆ తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తల దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్నా నిలువరించే చర్యలు చేపట్టనందుకు పోలీసు శాఖ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.
యశ్వంత్ రాజ్ కుమార్ మూడు నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ రీపోలింగ్ జరిగిన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరచలేదని చెబుతున్నారు. గడిచిన మూడు నెలల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్లుగానే డీఎస్పీ చేశారన్నది టీడీపీ శ్రేణుల ఆరోపణ. ఎన్నికల రోజు ఘర్షణలను నివారించడంలో పోలీసులు విఫలమయ్యారు. కనీసం ఆ తర్వాతైనా ఎమ్మెల్యే చెవిరెడ్డికి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి భద్రత కల్పించి, వారి ఉనికిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే హత్యాయత్నం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.