DC Vs GT : చివరి బంతి వరకూ ఉత్కంఠే
DC Vs GT : ఆల్ రౌండర్ రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్ లాంటి అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ని నాలుగు పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. కాగా గుజరాత్ ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి పడిపోయింది. గుజరాత్‌కు కూడా 8 పాయింట్లు ఉన్నాయి.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు గుజరాత్‌కు 225 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేయర్ సాయి సుదర్శన్ అత్యధిక పరుగులు చేశాడు. సుదర్శన్ 39 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లు బాదాడు.
సుదర్శన్ మినహా డేవిడ్ మిల్లర్ కేవలం 23 బంతుల్లో 55 పరుగులు చేశాడు. మిల్లర్ మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లు కొట్టాడు. చివర్లో రషీద్ ఖాన్ 11 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్ సాయంతో 21 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రసిఖ్ దార్ సలామ్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఎన్రిక్ నార్కియా, ముఖేష్ కుమార్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. జట్టు తరఫున ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, కెప్టెన్ రిషబ్ పంత్ వేగంగా అర్ధ సెంచరీలు నమోదు చేశారు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అక్షర్ 43 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 66 పరుగులు చేశాడు. పంత్ 43 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేశాడు. తన అత్యద్భుమైన ఇన్నింగ్స్‌కు పంత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. దాదాపు ఏడాదిన్నరకు పైగా క్రికెట్ దూరమైన రిషబ్ పంత్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో తనలోని ఫైర్ తగ్గలేదని నిరూపించాడు.