Team India : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా ఓటమి తర్వాత జట్టు ప్రక్షాళనకే బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కొత్త వారికి అవకాశం ఇచ్చి వారిని రాటుదేల్చి మెరుగైన ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే టీ20 జట్టులో యువతకు పెద్దపీట వేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.
టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా గాయంతో దూరం కావడంతో ఇప్పుడు అతడి స్థానంలో డ్యాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈనెల 23న ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ కోసం సూర్య కుమార్ ను కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇవాళ అహ్మదాబాద్లో భేటీ అయిన సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ వైపు కూడా కొందరు సెలక్టర్లు మొగ్గు చూపగా.. చివరికి సూర్యకే జట్టు పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించారట.
రోహిత్, కోహ్లి, బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనుండగా.. హార్దిక్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో సూర్యకు ఈ అవకాశం దక్కింది.