Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దుపై తేల్చనున్న సుప్రీంకోర్టు.. ప్రభుత్వ పిటిషన్ పై ఇవాళ విచారణ..
Chandrababu : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఇప్పటికే సీఐడీ నమోదు చేసిన కేసులు, వాటి బెయిళ్ల వ్యవహరం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే హైకోర్టు మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా.. వాటిలో ఒక్కో కేసులో వాటి రద్దు కోరుతూ ప్రభుత్వం న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో గతంలో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రూపొందించిన అలైన్ మెంట్ లో మార్పులు చేసిన విషయంలో అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై కేసులు నమోదు చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ జరుపబోతోంది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టు కూడా సమర్థిస్తే సరి. లేకపోతే మాత్రం వరుసగా మిగతా కేసుల్లోనూ ఆయన బెయిళ్లను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. దీంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేుసలో చంద్రబాబు బెయిల్ పై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారబోతోంది.