Kejriwal : కేజ్రీవాల్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Kejriwal

Kejriwal

Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ కు ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని స్పష్టం చేసింది. దీంతో 6 నెలల పాటు తీహార్ జైలులో ఉన్న ఆయన విడుదల కానున్నారు. అటు, సుప్రీం తీర్పుపై ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాగా, మద్యం పాలసీకి సంబంధించి గతంలో ఈడీ కేసులో బెయిల్ రాగా, సీబీఐ కేసులో సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాంలో మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేయగా, ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడం సహా బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. వీటిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలతో బెయిల్ ఇచ్చింది. కేసు గురించి ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని, ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు సైతం చేయవద్దని పేర్కొంది. కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలని తెలిపింది.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తుల హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టు సరైందే అయినా, చేసిన సమయం మాత్రం సరిగా లేదని అభిప్రాయపడింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదని పేర్కొంది. ప్రతి వ్యక్తికీ ‘‘బెయిల్ అనేది నిబంధన.. జైలు మినహాయింపు’’గా ఉండాలని మరోసారి వెల్లడించింది.

TAGS