Sunrisers Hyderabad : చెన్నై సూపర్ కింగ్స్ తో చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కెప్టెన్ కమిన్స్ నిర్ణయం సరైనది కాదని తేలిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాటర్లు దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగుల వద్ద ఔటై సెంచరీ మిస్ చేసుకున్నాడు. డెరిల్ మిచెల్ 52 పరుగులతో రాణించాడు.
చివర్లో శివమ్ దూబె 20 బంతుల్లోనే 4 సిక్సులు, 1 ఫోర్ సాయంతో 39 పరుగులు చేయగా.. దోని రెండు బంతుల్లోనే 5 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలింగ్ లో కమిన్స్ నాలుగు ఓవర్లలోనే 49 పరుగులు సమర్పించుకున్నాడు. భువీ, నటరాజన్, ఒక్కో వికెట్ తీయగా.. నితీశ్ రెడ్డి ఒక ఓవర్ వేసి 8 పరుగులు ఇచ్చారు.
అనంతరం 212 పరుగుల ఛేజింగ్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (13) అభిషేక్ శర్మ 15 పరుగులకే ఔట్ కాగా.. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఎక్కడా కూడా గెలుస్తామన్న నమ్మకం లేకుండా ఆడారు. జట్టు 21 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ ఔటవ్వగా.. ఇంఫాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ 40 పరుగుల వద్ద ఔట్ కాగా.. అప్పటి నుంచి బ్యాటింగ్ స్లో గా సాగింది.
మర్ క్రమ్ ఒక్కడే 32 పరుగులు చేయగా.. పతిరణ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, హెన్రిచ్ క్లాసెన్ లు విఫలం కావడంతో 18.5 ఓవర్లలోనే 134 పరుగులకే కుప్పకూలి 78 పరుగుల భారీ తేడాతో సన్ రైజర్స్ ఓడిపోయింది. దీంతో పాయింట్ల టేబుల్స్ లో సన్ రైజర్స్ నాలుగో స్థానానికి పడిపోగా.. చెన్నై మూడో స్థానానికి చేరుకుంది. రేపటి మ్యాచ్ లో ఢిల్లీ గనక గెలిస్తే సన్ రైజర్స్ అయిదు లేదా ఆరో స్థానానికి పడిపోయినా ఆశ్యర్యపోనక్కర్లేదు