SRH Vs MI : నిన్నటి ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ చూసి దిమ్మతిరిగిపోని వారుండరు. బౌండరీ, సిక్సర్ల వర్షంతో అభిమానులు తడిసిముద్దైపోయారు. బంతి నేలపై కన్నా గాల్లోనే ఎక్కువగా కనిపించయని చెప్పొచ్చు. మొత్తానికి ఐపీఎల్ అంటే ఇలా ఉంటుందనిపించింది. సన్ రైజర్స్ సొంత మైదానంలో దుమ్ముదులపడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సన్ రైజర్స్ దూకుడుకు ముంబై ఇండియన్స్ గట్టిగానే పోరాటం చేసిందని చెప్పవచ్చు. ఓటమిని అంగీకరించని ముంబై ఛేజింగ్ లో 246 పరుగులు చేసింది. మ్యాచ్ లో బాదిన వాళ్లకు బాదినంత అన్నట్టుగా బ్యాటర్ల ఊచకోత సాగింది. ఇక బౌలర్లకు మాత్రం నిన్న కాళరాత్రే. ముఖ్యంగా హెడ్, అభిషేక్ ధనాధన్ ఇన్నింగ్స్ ను మరిపిస్తూ క్లాసెన్ ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. 23 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్ అందుకున్న క్లాసెన్ ముంబైకి మరింత ప్రమాదకరంగా మారాడు. బుమ్రా 19వ ఓవర్ లో 13 పరుగులకే పరిమితమైన.. షమ్స్ ములానీ అఖరి ఓవర్లో క్లాసెన్ రెండు కండ్లు చెదిరే సిక్స్ లకు తోడు ఫోర్ తో హైదరాబాద్ కు ఐపీఎల్ రికార్డు స్కోర్ అందించాడు.
ఐపీఎల్ 17 సీజన్ లో హైదరాబాద్ లో తొలి మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోయే వినోదాన్ని పంచింది. అభిమానులకు మజానే కాదు..ఎన్నో రికార్డులను సన్ రైజర్స్ బద్దలు కొట్టింది. ఆ రికార్డులు ఏంటో చూద్దాం..
-నిన్నటి మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఒక జట్టు 277 పరుగులు చేసింది. ఇది తిరుగులేని రికార్డు.
– మ్యాచ్ లో మొత్తం 523 పరుగులు నమోదయ్యాయి. ఇది ఐపీఎల్ లోనే అత్యధికం.
– మొత్తం 38 సిక్సులు కొట్టారు. ఓ ఐపీఎల్ మ్యాచ్ లో ఇదే అత్యధిక సిక్సర్ల రికార్డు. ఇంతకు ముందు ఆర్సీబీ 33 పేరు మీద ఉన్న రికార్డును ఇది తుడిచిపెట్టేసింది.
-ఛేజింగ్ లో కూడా ఓ రికార్డు నమోదైంది. ముంబై ఇండియన్స్ ఛేదనలో 246 పరుగులు చేసింది. ఐపీఎల్ లో ఇదే ఛేజింగ్ హైయస్ట్ స్కోర్.
– 10 ఓవర్లలో 148 పరుగులు చేసిన జట్టుగా సన్ రైజర్స్ రికార్డు నమోదు చేసింది. అలాగే ముంబై ఇండియన్స్ కూడా 141 పరుగులు చేసి ఆ క్లబ్ లో చేరింది.
కాగా, రికార్డుల వరద పారిన ఈ మ్యాచ్ రోహిత్ కు ముంబై ఇండియన్స్ తరుఫున 200వది కావడం విశేషం. ఒక ఐపీఎల్ జట్టుకు ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లలో రోహిత్ కంటే కోహ్లీ, ధోనీ ముందున్నారు.