Sunita and Will More : అంతరిక్ష కేంద్రానికి చేరిన సునీత, విల్ మోర్
Sunita and Will More : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు గురువారం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్నారు. వీరిని రోదసిలోకి తీసుకెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌక గురువారం రాత్రి అంతరిక్ష కేంద్రంతో క్షేమంగా అనుసంధానమైంది. బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ క్యాప్యూల్ కు ఇది తొలి మానవ సహిత యాత్ర. అంతకుముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్-కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఇది ఐఎస్ఎస్ తో అనుసంధానం అయింది.
ఆ సమయంలో ఈ అంతరిక్ష కేంద్రం, దక్షిణ హిందూ మహా సముద్రానికి ఎగువన 400 కిలోమీటర్ల ఎత్తులో విహరిస్తోంది. ఏఎస్ఎస్ కు చేరే క్రమంతో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్ మోర్ లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలోనూ ఈ క్యాప్సూల్ కు హీలియం లీకేజీ సమస్య ఏర్పడింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని తెలిపారు.