Sunburn Festival:నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మాదాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన సన్‌బర్న్ వేడుకల్ని నిర్వాహకులు అర్థాంతరంగా రద్దు చేశారు. ఈవెంట్‌కు సంబంధించి బుక్‌మై షోలో టికెట్ల విక్రయాన్ని కూడా ఆపేశారు. ఈ వ్యవహారంపై ఈవెంట్ నిర్వాహకుడు సుశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకోకుండా టికెట్లు విక్రయించినందుకుగానూ బుక్ మై షో , నోడల్ అధికారులకు పోలీసులు నోటీసులిచ్చారు.
దీంతో బుక్ మై షోలో `సన్‌బర్న్ షో హైదరాబాద్` ఈవెంట్ కనిపించడం లేదు. అయితే విశాఖ వేదికగా జరగబోయే `సన్‌బర్న్` ఈవెంట్‌కు సంబంధించిన టికెట్‌లు మాత్రం బుక్ మై షోలో అమ్ముడవుతున్నాయి. సన్‌బర్న్ అనేది భారీ సంగీత వేడుక. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో మద్యానికి అనుమతి ఉంటుంది. ఇదే అదనుగా ఈ ఈవెంట్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వహాకులతో పాటు బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సన్‌బర్న్ ఈవెంట్ ని హైదరాబాద్‌లో నిర్వహించడానికి నిర్వాహకులు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.