Sukhbir Singh : శిరోమణి అకాలీ దళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ రిజైన్..

Sukhbir Singh : శిరోమణి అకాలీ దళ్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ  అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శనివారం (నవంబర్ 16) రాజీనామా చేశారు. సిక్కు మత సూత్రాలు ఉల్లంఘించారని అకల్ తఖ్త్ ఇటీవల ఆయనపై అభియోగాలు మోపింది. ఈ క్రమంలో శిరోమణి అకాలీ దళ్ (‘సాద్’) పార్టీకి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా చేసి లేఖను పార్టీ వర్కింగ్ కమిటీకి పింపించారు. విషయాన్ని పార్టీ సీనియర్ నేత దల్జిత్ సింగ్ చీమా ధ్రువీకరించారు.

‘పార్టీ వర్కింగ్ కమిటీకి సుఖ్‌బీర్ సింగ్ రాజీనామా పంపించారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యం కానుంది. తనపై నమ్మకం ఉంచి సహకరించిన వారికి, కార్యకర్తలకు సుఖ్‌బీర్ లేఖలో కృతజ్ఞతలు తెలిపారని’  దల్జీత్ సింగ్ తెలిపారు.

శిరోమణి అకాలీ దళ్ (సాద్) ప్రజాస్వామిక పార్టీ అని, పార్టీ నిబంధనల ప్రాకం.. అధ్యక్ష పదవికి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని దల్జీత్ వివరించారు. 2019, డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయని, వచ్చే నెలతో ఐదేళ్ల గడువు పూర్తవుతుందన్నారు. ప్రస్తుత అధ్యక్షుడి రాజీనామా మేరకు నవంబర్ 18న వర్కింగ్ కమిటీ సమావేశమై, పరిశీలన చేసి ఎన్నికలపై ప్రకటన జారీ చేస్తుందన్నారు.

ఎన్నికల్లో పార్టీకి చెందిన కార్యకర్త స్థాయి నుంచి నాయకుల వరకు ఎవరైనా పోటీ చేయవచ్చని, ఎవరికి మెజారిటీ ఉంటే వారు అధ్యక్షుడి స్థానం అధిరోహిస్తారని చెప్పారు. పంజాబ్‌లో కీలక అంశాలను పరిష్కరించడంలో, రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంలోనూ ‘సాద్’ కొంత కాలంగా విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే బాదల్ రాజీనామా కీలకంగా మారనుంది.

 

TAGS