– రైలు కిందపడి యువ దంపతుల ఆత్మహత్య
Suicide : బంధువుల దుష్ప్రచారం మనస్తాపం చెందిన యువ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు వారు చనిపోతున్నట్లు ఓ వీడియోను రికార్డు చేసి పోలీసులకు పంపించారు. పోలీసులు అప్రమత్తమైనా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్ మండలం హెగ్దోలి గ్రామానికి చెందిన అనిల్ (28), పొతంగల్ కు చెందిన శైలజ (24)కు ఏడాది క్రితం వివాహమైంది. ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యలకు చెప్పి సోమవారం వారు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత, తాను చేసిన ఓ తప్పును భర్త క్షమించినా బంధువులు మాత్రం వదలడం లేదని, దుష్ప్రచారం చేస్తున్నారని, అది భరించడం తమ వల్ల కావడం లేదని, గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెబుతూ శైలజ ఓ వీడియోను రికార్డు చేసి కోటగిరి ఎస్సైకి పంపింది.
అప్రమత్తమైన ఎస్సై సందీప్ వెంటనే నవీపేట ఎస్సైకి ఆ వీడియోను, ఫోన్ నెంబరును పంపారు. అక్కడి నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే బాసర వంతెన వద్దకు వెళ్లి గాలించారు. అక్కడ ఎవరూ కనిపించక పోవడంతో వారి ఫోన్ నెంబరును ట్రాక్ చేశారు. ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య లొకేషన్ చూపించడంతో అక్కడికి వెళ్లి చూడగా పట్టాలపై అనిల్, శైలజ మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.