YCP MLA Pinnelli : హత్యాయత్నం కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. మూడు కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయనను అరెస్టు చేయవద్దని నిన్న మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో ఉపశమనం లభించడంతో రాత్రి 9 గంటల సమయంలో నరసరావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్ లో బస చేశారు. ప్రతి రోజూ ఎస్పీ ఎదుట హాజరుకావాలన్న కోర్టు షరతు ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ ఎదుట హాజరయ్యారు.
ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఈనెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయనను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటికే ఆయన పరారైనట్టు గుర్తించిన పోలీసులు పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టగా ఆయన చిక్కలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, ఆయనపై హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలపై నమోదైన కేసుల్లో అరెస్టు చేసే అవకాశముందని భావించిన ఆయన అజ్ఞాతం వీడలేదు. తాజాగా ఆ కేసుల్లోనూ ఉపశమనం లభించడంతో బయటకు వచ్చారు.