Pawan Kalyan : ఏపీలో డిప్యూటీ సీఎం గా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ శాఖల అధికారులతో మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతిభను వెలికితీయాలని వారిని సైంటిస్టులుగా.. మార్చేలా సైన్స్ ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం విజన్ 2047 కు అనుగుణంగా వివిధ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. విద్యార్థులను సైంటిస్టులుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సి ఉందన్నారు. రాజమండ్రి లో ప్రాంతీయ సైన్స్ కేంద్రాన్ని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మార్పు చూపిస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ తన పాలన ప్రారంభించారు. మంత్రిగా అధికారులతో సమావేశమై వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగానే కాకుండా పంచాయతీ రాజ్ శాఖ, అటవీ శాఖ, ఆర్ డబ్ల్యూఎస్, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇందులోని అనేక ఫైల్స్ పై మొదటి సారి సంతకాలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎక్కువ శాఖలు తీసుకున్నది కూడా పవన్ కల్యాణే కావడం గమనార్హం.
ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు ఫైల్ పై మొదటి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ ఫైల్ పై సంతకాలు చేశారు. అలాగే పలు ఫైల్స్ పై ఆయన సంతకాలు చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని ప్రజా పాలన అందించేందుకు కృషి చేస్తామని ఆయన ప్రమాణ స్వీకారం, బాధ్యతల సందర్భంగా తెలిపారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగానే కాకుండా ఏకంగా డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం జనసేన సైనికులను ఆయన అభిమానులకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఇదే విధంగా ప్రజలకు మంచి పాలన అందించేందుకు కృషి చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.