TDP : తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో, బయట ఎంతో మంది సపోర్ట్ చేస్తుంటారు. వీరికంటే ఎక్కువగా స్ట్రాటజిస్టులే ఇప్పుడు ఎక్కువగా తయారైపోయారు. టీడీపీ కోసం పనిచేస్తున్నామనే భ్రమల్లో మునిగిపోయి ఉంటారు వీళ్లు. టీడీపీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వీరంతా 140డిగ్రీల కోణంలో విశ్లేషించి ఏం చేయాలో.. ఏం చేయకూడదో కూడా ప్రకటించేస్తుంటారు.
జనసేనతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ చెప్పిన కొన్ని మాటలను పట్టుకుని స్ట్రాటజిక్ సలహాలతో సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. అసలు వీళ్ల లక్ష్యం ఏమిటో వారికైనా తెలుసా లేదా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చాలా స్పష్టంగా చెప్పారు.. పొత్తు ఎందుకోసమో. వంద సీట్ల కోసం అయితే ఒంటరిగా పోటీ చేయవచ్చు కానీ.. వైసీపీని పూర్తి స్థాయిలో సీన్ లో లేకుండా చేయాలంటే పొత్తు కచ్చితంగా ఉండాలన్నారు. ఆయన మాటలు అవి. ఇక జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి.. ఏ సీట్లు ఇవ్వాలన్నది పై స్థాయిలో నిర్ణయించుకుంటారు. పవన్ కల్యాణ్ కూడా పట్టుదలకు పోయి ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోవాలని కోరుకోరు కదా. పాతిక సీట్లు తీసుకుని పాతిక సీట్లలో గెలవడం గొప్పనా.. యాభై సీట్లు తీసుకుని పాతిక సీట్లు గెలవడం గొప్పనా.. అనే రాజకీయం వారికి తెలియదా?
పవన్ రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. దానికి చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించారన్న కారణం చూపించారు. నిజానికి ఇక్కడ పోటీలు పెట్టుకోవడం కన్నా.. ఆ రెండు పార్టీలు వేగంగా నిర్ణయాలు తీసుకుని సీట్ల షేరింగ్ పూర్తి చేసుకుని అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయమే ఎక్కువగా వినపడుతోంది. కానీ వారి రాజకీయ వ్యూహాలు వారికి ఉన్నాయి.
వైసీపీకి చిన్న చాన్స్ ఇచ్చినా ఏం జరుగుతుందో వారికి తెలుసు. పొత్తులు వద్దని కొంతమంది వితండ ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారు. పవన్ నిలకడ లేమి తనంపై ఉదాహరణలు చెపుతున్నారు. రాజకీయాల్లో తొందరపాటు అనేది కచ్చితంగా పతనానికే దారితీస్తుంది. పంతాలకు పోతే ఏం జరుగుతుందో ఇప్పటికే చాలా మంది రాజకీయ నేతల జీవితాలు తలకిందులై ఎదురుగా కనిపిస్తునే ఉన్నాయి. ఇప్పటికైనా టీడీపీ, జనసేన అధినేతలు పొత్తు ప్రహసనాన్ని వేగంగా పూర్తిచేసి ఎన్నికలకు అస్త్రశస్త్రాలతో రెడీ కావాలని ఎక్కువ మంది అభిప్రాయం.