Jagan – Sharmila : ఏపీలో అన్నా చెల్లెళ్ల కథ: అన్నకు సాకులే అస్త్రాలైతే.. చెల్లికి ప్రశ్నలే ఆయుధాలు!

Jagan - Sharmila

Jagan – Sharmila

Jagan – Sharmila : జగన్ తన తండ్రి వైఎస్ఆర్ మరణానంతరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి  తన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిలను రాజకీయాల్లోకి తీసుకువచ్చి రుచి చూపించారు. అయితే, సోదరికి ప్రత్యక్ష రాజకీయాలను పరిచయం చేసిన జగన్ రాజకీయ క్షేత్రంలో సొంత వారిని ఎలా వాడుకోవాలి? ఆ తర్వాత వారిని ఎలా వదిలించుకోవాలి అనేది కూడా వివరించారు.

ముఖ్యమంత్రి పదవి కోసం తనను అడ్డుపెట్టుకున్న జగన్ పదవి దక్కగానే తనకు చేసిన ద్రోహానికి అన్నపై రాజకీయ యుద్ధం ప్రకటించి జగన్ పాలిట శిఖండిలా మారింది షర్మిల. వైసీపీ ఓటమి, జగన్ పతనం తన కర్తవ్యంగా పని చేసిన షర్మిల అందుకు తగ్గట్టే రాజకీయాల్లో అడుగులు వేసింది. యుద్ధంలో తన గెలుపు కన్నా ప్రత్యర్థి ఓటమే ప్రధాన ఎజెండాగా వైసీపీని మట్టి కరిపించింది షర్మిల.

పదవిలో ఉండగానే టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు ఉపేక్షిస్తుంది అనుకోవడం వైసీపీ నేతల వెర్రితనమే అవుతుంది. వినుకొండ హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించి తన పొలిటికల్ మైలేజ్ పెంచుకునేందుకు ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నారు జగన్.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.. అంటూ అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తున్న జగన్ ను తన ప్రశ్నలతో అడ్డుకుంటుంది షర్మిల.

‘ప్రతి పక్షంలోకి రాగానే ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు సిద్ధమైన జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో వివేకా హత్య మీద న్యాయం కావాలి అంటూ ఎందుకు ధర్నా చెయ్యలేదు..? సొంత బాబాయిని చంపిన వ్యక్తిని వెంటేసుకొని జగన్ తిరగడం హత్యా రాజకీయం కాదా?’

‘జగన్ హత్య రాజకీయాలు చేశారు, సొంత చెల్లిపై వ్యక్తి గత దాడులు చేశారు.  అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేకపోయారు? పోలవరానికి నిధులు కావాలని ఎందుకు ప్రశ్నించలేకపోయారు’ అంటూ తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు షర్మిల.

అప్పుడు సీఎం పదవి అడ్డుపెట్టుకొని కోర్టుకు వెళ్లలేదు.. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం చేయలేక ధర్నాల పేరుతో సాకులు వెతుక్కుంటున్నారు అంటూ జగన్ అభద్రత, భయాన్ని ప్రజల ముందుంచారు షర్మిల.

అన్నకు సాకులే అస్త్రాలుగా మారితే.. చెల్లికి ప్రశ్నలే ఆయుధాలుగా మారాయి. ఈ ఇద్దరు అన్నా, చెల్లెళ్ల మధ్య రాజకీయ పోరు రోజుకో ఘట్టాన్ని ఆవిష్కరిస్తుంది. షర్మిల ప్రశ్నలకు ధీటైన సమాధానం చెప్పే సాహసం జగన్ చేయలేరు. ఒకవేళ చేసినా అది జగన్ కు రాజకీయంగా, వ్యక్తి గతంగా ఎదురుదెబ్బే.

తానకు రాజకీయ అవకాశం ఇచ్చిన వ్యక్తే తనపైనే తిరగబడితే ఎలా ఉంటుందో జగన్ కు ఇప్పుడు తెలిసి వస్తుందేమో. తన కుటుంబానికి రాజకీయ జీవితాన్ని, పదవులను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి జగన్ చేసిన ద్రోహానికి షర్మిల బదులు తీర్చుకుంటుంది.

కోర్టు సమన్ల నుంచి, అసెంబ్లీ సమావేశాల నుంచి ఎదో ఒక సాకుతో సులువుగా తప్పించుకుంటున్న జగన్ తన చెల్లి షర్మిల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు, ఎప్పటికీ తప్పించుకోలేరని స్పష్టమయిపోయింది. 

TAGS