Flood threat : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో పలు జిల్లాలకు వరద ముప్పు
Flood threat : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 15 కి.మీ. వేగంతో దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 280 కి.మీ., పుదుచ్చేరికి 320 కి.మీ., నెల్లూరుకు 370 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని ప్రకటించింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.