Jeevitha Rajasekhar : సన్నివేశం ఏదైనా తన అభిప్రాయం మాత్రం ధైర్యంగా చెప్పే వారిలో నటి జీవిత ఒకరు. ఎలాంటి నిర్మొహమాటం లేకుండా మాట్లాడడం వల్ల చాలా సందర్భాల్లో వివాదాలను ఎదుర్కొన్నారు కూడా. వాటికి సంబంధించి కొన్ని విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకచ్చింది నటి జీవిత.
జీవిత మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు దాటింది. ఎన్నో ఎత్తు పళ్లాలు, ఒడిదొడుకులను చూశా. చాలా విషయాలు నేర్చుకున్నా. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నా నైజం. కానీ అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని.. అలా చేయడం కొందరికి నచ్చదని అర్థమైంది. ప్రతీ విషయంపై మనం స్పందించకపోతే ప్రపంచం ఆగిపోదు కదా? అనుకున్నా.. అందుకే మాట్లాడడం చాలా వరకు తగ్గించా. అన్నీ అంశాలపై స్పందించకపోవడం వల్ల నేను, నా భర్త రాజశేఖర్ ఏమీ నష్టపోలేదు. ఇప్పుడు పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. మేమంటే నచ్చని వారి నుంచి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండద్దు. మా వల్ల వారి కెరీర్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడద్దు. అందుకే మౌనంగా ఉండిపోతున్నాం. ఇది భయం వల్ల కాదు. నేను ఏ విషయంలోనూ భయపడను’ అని చెప్పారు జీవిత.
‘మాతృదేవోభవ’లో మాధవి పాత్ర కోసం చిత్ర బృందం తమను సంప్రదించింది. కథ విన్న రాజశేఖర్ కూడా ఒకే అన్నాడు. కానీ నేనే అంగీకరించలేదు. దీంతో ఆ పాత్ర మాధవికి వెళ్లింది. పెళ్లి తర్వాత నటనకు కొంత దూరంగా ఉండాలనుకున్నా. అందుకే వదులుకున్నా. ఆ సమయంలో నేను బాధపడలేదు. 33 ఏళ్ల తర్వాత ఇటీవల ‘లాల్ సలాం’లో నటించా.. నా జీవితంలో కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా. నా భర్త, పిల్లలే నా ప్రపంచం’ అని తెలిపారు.