Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం నాటి రికార్డు నష్టాల నేపథ్యంలో ఆరంభంలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మధ్యలో కాసేపు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ తిరిగి కోలుకున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 529 పాయింట్ల లాభంతో 72,609 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 153 పాయింట్లు పుంజుకొని 22,037 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.46 వద్ద ప్రారంభమైంది.
అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఈరోజు ఆసియా-పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 77.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా రూ.12,436 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు సైతం రూ.3,318 కోట్ల షేర్లను అమ్మేశారు.