SS Rajamouli:తనదైన ప్రతిభ, అజేయమైన ట్రాక్ రికార్డ్‌తో భారతదేశంలోనే నంబర్ -1 డైరెక్టర్‌గా ఘనతికెక్కారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. మణిరత్నం, శంకర్, రాజ్ కుమార్ హిరాణీ, భన్సాలీ, మధుర్ భండార్కర్, అశుతోష్ గోవారికర్ .. ఇలా ఎందరో దిగ్గజాలంటి దర్శకులు దేశంలో ఉన్నా కానీ, నేడు ఎస్.ఎస్.రాజమౌళి గురించి దేశవిదేశాల్లో ప్రతి మారుమూలకు తెలుసు. ఆస్కార్, గోల్డన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాల్ని భారతదేశానికి అందించిన ఏకైక దర్శక దిగ్గజంగా రాజమౌళి పేరు మార్మోగుతోంది. బాహుబలి-బాహుబలి 2- ఆర్.ఆర్.ఆర్ చిత్రాలతో అతడు ఈ స్థాయిని అందుకున్నారు.
అయితే అలాంటి గొప్ప దర్శకుడు తన సహచర దర్శకుడిపై తన అభిమానాన్ని చాటుకున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీని ప్రశంసించిన ఒక త్రోబ్యాక్ వీడియో ఎక్స్ (ట్విట్టర్)లో చక్కర్లు కొడుతోంది. ఇందులో రాజమౌళి మాట్లడుతూ-`కరణ్ జోహార్- నేను ఆయన తరహా చిత్రాలు చేయలేము. నిజం చెప్పాలంటే నేను రాజు హిరాణీ చేసే ఒక్క సీన్ కూడా చేయలేను. నా పని కంటే ఆయన చేసే పని చాలా గొప్పది అని నేను భావిస్తున్నాను. హిరాణీ సూక్ష్మపరిశీలనతో కూడుకున్న రచన, భావోద్వేగాలతో అందరినీ ఆకట్టుకుంటారు. నా సినిమాల్లో బలమైన భావోద్వేగాలు ఉంటాయి.
నేను తీవ్రంగా యాక్షన్ తో కొడతాను. కానీ చాలా సూక్ష్మమైన భావోద్వేగాలతో అతడు (హిరాణీ) ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. అది నా దగ్గర ఉన్నదానికంటే చాలా గొప్ప టెక్నిక్` అని అన్నారు. రాజ్‌కుమార్ హిరాణీ ఎంత గొప్ప దర్శకుడో రాజమౌళి వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. S. S. రాజమౌళి స్వయంగా హిరాణీ కళను ప్రస్తావిస్తూ కనిపించడంతో ప్రేక్షకుల్లో `డంకీ`పై కొంత ఆసక్తి పెరిగిందని బాలీవుడ్ మీడియాలు వ్యాఖ్యానించాయి.
రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీ 21 డిసెంబర్ 2023న విడుదల కానుంది. డంకీలో షారుఖ్ ఖాన్‌తో పాటు ప్రతిభావంతులైన నటులు బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ తదితరులు నటించారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ , రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్ సమర్పణలో రాజ్‌కుమార్ హిరానీ, గౌరీ ఖాన్ నిర్మించారు. అభిజత్ జోషి, రాజ్‌కుమార్ హిరాణీ- కనికా ధిల్లాన్ రచయితలు.