Srinuvaitla : ఆ సినిమా చేసి ఇప్పటికీ కోలుకోలేకపోతున్న శ్రీనువైట్ల
Srinuvaitla : శ్రీను వైట్ల వినోదాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. తొలుత చిన్న హీరోలు, కొత్త హీరోలతో చేసిన శ్రీను వైట్ల ఆ తర్వాత పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. శ్రీను వైట్ల తన తొలి చిత్రం మాస్ మహారాజ రవితేజతో చేశాడు. అప్పటికీ రవితేజ హీరోగా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. రవితేజకు సోలో హీరోగా ఇదే తొలి సినిమా. ఈ సినిమాతోనే శ్రీను వైట్ల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా అనుకున్న విజయం సాధించకపోయినా అటు రవితేజకు, ఇటు శ్రీను వైట్లకు కెరీర్ కు మాత్రం ఉపయోగపడింది. ఇక ఆ తర్వాత ఆనందం, సొంతం సినిమాలు శ్రీను వైట్ల ప్రతిభను నిరూపించాయి. ఆనందం చిన్న సినిమాగా రిలీజై విజయం సాధించగా, ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఆ తర్వాత సొంతం సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక రవితేజతో మరోసారి చేసిన వెంకీ సినిమా శ్రీను వైట్ల కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచింది. ఆ తర్వాత డీ,దుబాయ్ శ్రీను, కింగ్, నమో వెంకటేశ, బాద్ షా, దూకుడు చిత్రాలతో వరుస సక్సెస్ లు కొట్టాడు శ్రీను. ఇక దూకుడు సినిమా మహేష్ బాబు సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. శ్రీను లైప్ లో కూడా ఇదే పెద్ద హిట్టు. ఆ తర్వాత శ్రీను వైట్ల కెరీర్ సందిగ్ధంలో పడింది. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాతర మహేష్ బాబు తో శ్రీను వైట్ల చేసిన మరో సినిమా ఆగడు. పాటలు, ఫైట్లు, డైలాగులు సినిమాకు హైప్ క్రియేట్ చేశాయి. దూకుడు ను మించిన సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఫలితం తిరగబడింది. అటు మహేష్ కెరీర్ లో, ఇటు శ్రీను కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక అక్కడి నుంచి శ్రీను కెరీర్ డైలామాలో పడిపోయింది.
ఆగడు తాను చేసిన అతి పెద్ద తప్పు అని శ్రీను వైట్ల అంగీకరించాడు. అయితే ఆగడు సినిమా అసలు కథ వేరే అనుకున్నామని, కానీ తాము అనుకున్న కథ కు బడ్జెట్ పరిమితులు పెరిగిపోవడంతో నిర్మాతలు ముందుకురాలేదని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు. కథ మార్చి చేసిన సినిమా మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టిందంటున్నాడు శ్రీను వైట్ల. ఆ కథ ఇప్పటికీ తన దగ్గరే ఉందని, కానీ ఇప్పుడా కథతో సినిమా చేసినా ఫలితం ఉండదంటున్నాడు. అనుకున్న కథతో సినిమా తీయకపోవడం ప్రధాన లోపమని, అనుకున్న కథను తీయడంతో రాజీ పడవద్దని అంటున్నాడు శ్రీను వైట్ల. తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం విశ్వం దసరాకు విడుదల కాబోతున్నది. ఈ సినిమాతోనైనా శ్రీను కెరీర్ గాడిన పడుతుందో లేదో చూడాలి.