Mark Zuckerberg : ‘‘పుణ్యభూమి నా దేశం నమో నమామి..ధన్యభూమి నా దేశం సదా స్మరామి..’’ అన్నట్లుగా ఎంతో మంది మహనీయులకు భారత దేశం జన్మనిచ్చింది. మహోన్నత సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకే కాదు ప్రపంచానికి అంతులేని జ్ఞానాన్ని అందించిన ఘనత భారతవనికే దక్కింది. భారతీయుల గొప్పతనాన్ని, సమాజ శ్రేయస్సు కోసం మన ప్రాచీన భారతీయులు చేసిన ఆవిష్కరణలను మనం తరచుగా విస్మరిస్తుంటాం. ఆయా రంగాల్లో రాణించిన మన భారతీయుల గొప్పతనాన్ని మనం గుర్తించలేదని, అందుకు శ్రీనివాస రామానుజన్ ఒక ఉదాహరణ అన్నారు. భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణి మరియు నిరంతర భాగాలకు గణనీయమైన సహకారం అందించాడు. గణితంలో ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండానే ఇదంతా చేశాడు.
ఇటీవల మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ శ్రీనివాస రామానుజన్ గొప్పతనం గురించి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా వివిధ కారణాలతో వైరల్ అవుతున్న పాత వీడియో ఇది. మార్క్ జుకర్ బర్గ్ తన ప్రసంగంలో రామానుజన్ ఎలా సాధించారో, ఆ సమయంలో ఎలాంటి వనరులు లేకుండా ఆయన వద్ద ఏముందో వివరించారు.
ఆయన మాటల్లోనే.. ‘‘ఇండియాలో పెరిగిన శ్రీనివాస రామానుజన్ అనే వ్యక్తి పేదవాడు, అప్పట్లో ఇంటర్నెట్ లేదు. ఆయనకు అధికారిక విద్య లేదు కాని ఎలాగోలా గణిత పాఠ్యపుస్తకాన్ని పొందగలిగాడు మరియు ఆ పుస్తకం ఆ సమయంలో ఉన్న ఆధునిక గణిత శాస్త్రాన్ని కనుగొని ఈ రంగాన్ని ముందుకు నడిపించడానికి సరిపోయింది. దీని గురించి ఆలోచించండి… అతనికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఏమి జరిగేది?’’ అంటే ఆసక్తికర విషయాలు చెప్పడమే కాదు శ్రీనివాస రామనుజన్ గొప్పతనాన్ని వెల్లడించారు.