- బౌలర్లపై దండయాత్ర చేసిన సన్ రైజర్స్
- మేం తక్కువ తినలేదన్న రాయల్స్ బెంగళూరు
SRH VS RCB : ఐపీఎల్ లో మరో సారి భారీ స్కోరు రికార్డు బద్ధలైంది. 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగులు చేసిన సన్ రైజర్స్ తన పేరు మీదనే ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి ఇండియన్స్ మీద కొట్టిన 277 పరుగుల రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. ఒకటి కాదు రెండు మొదటి ఇన్సింగ్స్ లో 22 సిక్సులతో బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు.
సోమవారం రాత్రి సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో పరుగుల సునామీ వచ్చినట్లయింది. సన్ రైజర్స్ 287/3 పరుగులు చేస్తే చేధనలో దినేశ్ కార్తీక్ (83) మెరుపులతో 262 పరుగులు చేసి సన్ రైజర్స్ ను భయపెట్టింది. మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హెడ్ సెంచరీతో చెలరేగగా.. అభిషేక్ శర్మ, క్లాసెన్ ఎప్పటిలాగే దంచి కొట్టారు. హెడ్ 8 సిక్సులు 9 బౌండరీలతో 102 పరుగులు దంచి కొట్టగా.. క్లాసెన్ 7 సిక్సులు 3 బౌండరీలతో 67 పరుగులు చేసి మరోసారి తాము నెలకొల్పిన రికార్డును తామే బద్దలు కొట్టుకున్నారు.
అనంతరం ఛేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కొహ్లి, పాఫ్ డుప్లెసిస్ మెరుపు ఆరంభినిచ్చారు. సిక్సులు, ఫోర్లతో చెలరేగి ఆడుతూ.. సన్ రైజర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్ ప్లే ఓవర్లలో దంచి కొట్టిన ఈ జోడి పవర్ ప్లే అనంతరం విరాట్ కొహ్లి 42 పరుగులకు మయంక్ మార్కండే బౌలింగ్ లో బౌల్డ్ అవడంతో వికెట్ల పతనం ఆరంభమైంది. మధ్యలో సౌరవ్ కుమార్, విల్ జాక్స్, రజత్ పటిదార్ సింగిల్ డిజిట్ కే పరిమితమైనా కూడా చివర్లో దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్సింగ్స్ ఆడి ఆర్సీబీకి గెలుపుపై ఆశలు రేపాడు.
మొత్తం మీద చిన్న స్వామి స్టేడియంలో పరుగుల సునామీ, బౌలర్లపై దండయాత్ర జరిగిందని చెప్పొచ్చు. మొదటి ఇన్సింగ్స్ లో 287 పరుగులు చేసిన సన్ రైజర్స్, రెండో ఇన్సింగ్స్ లో 262 పరుగులతో చెలరేగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. ఈ మ్యాచ్ లో రికార్డుల మోత మోగిందనే చెప్పొచ్చు. సన్ రైజర్స్ ఇప్పటికే రెండు సార్లు 277, 287 పరుగులతో రికార్డులను తిరగరాయగా.. చేధనలో ముంబయి, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 262, 242 పరుగులతో సరికొత్త రికార్డును సృష్టించాయి.