JAISW News Telugu

IPL 2024 : చేతులెత్తేసిన ఎస్ ఆర్ హెచ్ బ్యాటర్స్‌..  2024 ఐపీఎల్ విజేత కోల్ కతా నైట్ రైడర్స్

IPL 2024

IPL 2024

IPL 2024 : చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో కోల్ కతా అలవోకగా గెలిచి ఐపీఎల్ 2‌‌024 టైటిల్ ను సొంతం చేసుకుంది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ కోల్ కతా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో సన్ రైజర్స్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో 18 ఓవర్లకే 113 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సునీల్ నరైన్ తొందరగానే ఔటైనా.. వెంకటేశ్ అయ్యర్, ఓపెనర్ గుర్బాజ్ భువీ, కమిన్స్, నటరాజన్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ 10.3 ఓవర్లలోనే ఛేజింగ్ చేసి కోల్ కతాకు ట్రోపీ అందించారు. దీంతో కోల్ కతా ఐపీఎల్ 17 వ సీజన్ లో టైటిల్ విజేతగా నిలిచింది.

వెంకటేశ్ అయ్యర్ కేవలం 26 బంతుల్లోనే మూడు సిక్సులు, నాలుగు ఫోర్లతో 56 పరుగులు చేయగా.. గుర్బాజ్ 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లు కూడా సమిష్టిగా రాణించారు. మిచెల్ స్టార్క్ తన పూర్వపు ఫామ్ ను అందుకుని అభిషేక్ శర్మను మొదటి ఓవర్ లోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్ మూడో ఓవర్ లో రాహుల్ త్రిపాఠిని ఔట్ చేయడంతో 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అక్కడి నుంచి మార్కమ్ ఇన్సింగ్స్ ను నిలబెట్టాలని ప్రయత్నం చేసినా కోల్ కతా బౌలర్లు చాన్స్ ఇవ్వలేదు. అండ్రీ రస్సెల్ మూడు వికెట్లు, స్టార్క్ 2, హర్షిత్ రాణా 2, వైభవ్ అరోరా, సునీల్ నరైన్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీసి సన్ రైజర్స్ బ్యాటర్లను కోలుకోనివ్వలేదు.

Exit mobile version