JAISW News Telugu

Sreeleela : ఏడాదికే ఐరన్ లెగ్గా.. మరి హీరోల మాటేంటి?

Sreeleela

Sreeleela

Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ లో హీరోయిన్ శ్రీలీలపై భీకరమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఒక హిట్ వస్తే గోల్డెన్ ఎగ్, ఒక ఫ్లాప్ వస్తే ఐరన్ లెగ్.. గతంలో ఈ ప్రచారం కేవలం ఇండస్ట్రీలోనే జరిగేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతం కావడంతో వైరల్ రాయుళ్లు, ట్రోలర్లు తోడయ్యారు. ఆమెను తీసుకుంటే ఆ సినిమా మటాషే అనే ముద్ర వేసేస్తున్నారు పానం.

శ్రీలీల నిజంగానే ఐరన్ లెగ్గా..? ఆమె దివి నుంచి దిగి రాలేదు.. నాలుగు, ఐదేళ్లుగా ఫీల్డ్ లోనే ఉంది. మెడిసిన్ చదువుతూనే గ్లామర్ ఫీల్డ్‌ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.. రాఘవేంద్రరావు ‘పెళ్లిసందD’లో ఛాన్స్ ఇచ్చాడు.. అది సూపర్ ఫ్లాప్.. తర్వాత ‘ధమాకా’ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు వెంటపడ్డాయి. ఎంతలా అంటే ఒకేసారి 10 సినిమాలకు సైన్ చేసింది.

శ్రీలీల ఎవరు?
శ్రీలీల పదహారణాల తెలుగు పిల్ల.. పుట్టింది అమెరికాలోని ఓ తెలుగు జంటకు. ఆమె తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్ బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తోంది. సాధారణంగా తల్లి చెంతనే శ్రీలీల పెరిగింది. స్వర్ణలత భర్త సూరపనేని శుభాకరరావు.. కానీ వారు విడాకులు తీసుకున్నారు. తర్వాత శ్రీలీల పుట్టింది. ఆమె నా బిడ్డ కాదు అంటాడు శుభాకరుడు..

సరే, వాళ్ల కథ పక్కన పెడితే.. ‘ధమాకా’ తర్వాత ఆమెలోని డాన్స్ స్కిల్ గురించి ఇండస్ట్రీకి తెలిసింది. బాల్యం నుంచే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుందట. మొన్న ఎక్కడో మహేశ్ బాబు కూడా అన్నట్లు ఉంది కదా.. శ్రీలీలతో డాన్స్ చేయాలంటే తాట తెగిపోద్దని. అది నిజం.. కొరియోగ్రాఫర్ ఏ స్టెప్పు సజెస్ట్ చేసినా అలవోకగా, వేయగలదు.. ఆమెకు వచ్చిన సమస్య కూడా డాన్సే.. ఏ డాన్స్ ఆమెను హీరోయిన్ గా నిలబెట్టిందో అదే డీగ్రేడ్ చేస్తోంది.. జస్ట్, ఆమెను డాన్సుల కోసమే సినిమాలకు తీసుకుంటూ, ఎగిరేలా చేస్తున్నారు.. వరుసగా ఫ్లాపులు అని నిందలు వేస్తూ, ఇప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అంటున్నారు. గానీ మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రను ఆఫర్ చేసిందెవరు..?

స్కంధ, ఆది కేశవ, ఎక్స్ ఆర్డినరీ మ్యాన్.. అన్నీ హీరోల ఫెయిల్యూర్లే.. అందులో శ్రీలీల పాత్ర ఎంత? గుంటూరు కారంలో కూడా ఆమె డాన్స్‌నే చూపించేందుకు తాపత్రయపడ్డాడు త్రివిక్రమ్.. గతంలో వచ్చిన నాది నెక్కిలీసు గొలుసు వంటి హిట్ పాటలకు స్టెప్పులు వేయించాడు దర్శకుడు.. అవును, నటన కోణంలో ఆమె ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కానీ దర్శక నిర్మాతలు మంచి పాత్ర ఇస్తే కదా.. ఆమె కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా సినిమాలు అంగీకరిస్తూ ఫోతోంది. సరైన పాత్ర కావాలని అడగడం లేదు.. ఆలోచించడం లేదు.. డాన్స్ కోణంలో ఆమెకు ఇప్పటి వరకు తిరుగుల లేదు.  రీల్స్, షార్ట్స్ లో ‘కుర్చీని మడతపెట్టి’ పాటలో స్టెప్పులను అనుకరిస్తున్నారు జనం.

శ్రీలీలలాగే సాయిపల్లవి కూడా మంచి డాన్సర్.. కానీ ఆమె వెకిలి ఊపులకు అంగీకరించదు. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం, డీసెన్సీ లేకపోతే నో చెప్పడంలో ఏమాత్రం లేట్ చేయదు. అందుకే తెలుగు కుటుంబానికి (టాలీవుడ్ ఇండస్ట్రీకి) అలా దగ్గరైంది. శ్రీలీల కూడా ఇదే నేర్చుకోవాలి, ఒంట బట్టించుకోవాలి.. పిచ్చి స్టెప్పులదేముంది? కావాలంటే ఈ టీవీ ఢీ షోలో కూడా దొరుకుతారు! ఏ శేఖర్ మాస్టరో ఇంకాస్త పదును పెట్టగలడు!!

Exit mobile version