Sr NTR : ఎన్టీఆర్.. ఈ మూడక్షరాల పేరు తెలియని వారుండరు. తెలుగు సినిమాను కొన్ని దశాబ్దాల పాటు ఏలిన మహానటుడు, నటరత్న నందమూరి తారకరామారావు. దశాబ్దాల పాటు తెలుగు సినీ తెరపై నంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. తెలుగు వారికి రాముడైనా, కృష్ణుడైనా ముందుగా కనిపించే రూపం ఎన్టీయారే. అంతలా ఆ పాత్రలతో తెలుగవారిపై తనముద్ర వేసుకున్నాడు. శ్రీకృష్ణుడి పాత్రలో భారతదేశంలోనే ఎన్టీఆర్ లా ఒదిగిపోయిన నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అది ఎన్టీఆర్ నట విశ్వరూపం.
రాజకీయాల్లోనూ తనదైన ముద్ర..
తెలుగునాట రాజకీయాల్లోనూ కొత్త చరిత్రను లిఖించాడు. 40 ఏళ్లుగా ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ చెరిపివేయలేకపోయారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఔరా అనిపించాడు. ఒక సినీస్టార్ ఇంతలా ప్రభావం చూపుతాడా అని ఎవరూ ఊహించలేకపోయారు. అసలు సినీ నటులు రాజకీయాల్లో రాణించరంటూ కొట్టి పారేసిన వారూ ఉన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నెలకొల్పిన ఘనత ఎన్టీయార్ దే. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన రికార్డు ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు మీదే ఉంది. ఆ రికార్డును ఇప్పటికీ ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు.
ఓటు ప్రాముఖ్యతను అప్పుడే చెప్పిన ఎన్టీఆర్..
నందమూరి తారక రామారావు 1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించారు. చైతన్య రథం ద్వారా జైత్రయాత్ర కొనసాగించారు. ఈ తర్వాత ఎన్నికలు రావడంతో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. ముగింపు సభను తిరుపతిలో 1983 జనవరి1న ఏర్పాటు చేశారు.
ప్రచార యాత్ర ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్టీఆర్ దంపతులు దర్శనం చేసుకున్నారు. అదే నెల మూడో తేదీన తమిళ ఆహార్యంతో దర్శనమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన ఖాకీ దుస్తులతో పోలింగ్ స్టేషన్ వెళ్లి పవిత్రమైన తన ఓటు వేశారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పారు దివంగత ఎన్టీఆర్.