Sr. NTR : విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నటనా కౌశలం గురించి వర్ణించేందుకు పదాలు చాలవేమో. ఆయన తెర మీద కనిపించాడంటేనే ప్రేక్షకుల సంబురాలు మిన్నంటేవి. 80వ దశకంలో రాముడు, కృష్ణుడు ఎవరంటే ఎన్టీఓడే అనేవారు. ఇక 90వ దశకంలో వారు కళ్లు మూసుకుంటే దేవుళ్ల రూపంలో కనిపించేది కూడా ఎన్టీఆరే. వారి బాల్యం నుంచి కూడా ఎన్టీఆర్ ను దేవుడిగా చూశారు.
ఎన్టీఆర్ చేసిన ప్రతీ సినిమా అందులో ప్రతీ పాత్ర అభిమానులకు ప్రీతి పాత్రమే. ఆ కాలంలోనే డ్యూయల్ రోల్ నుంచి దాన వీర శూర కర్ణలో నాలుగు పాత్రలు తానే వేసి మెప్పించాడు. ఆయన వెండితెరపై చేసినన్ని సాహసాలు ఆ కాలంలో ఏ ఇతర భాషా ఇండస్ట్రీలో ఏ నటుడు కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు. పాత్ర ఏదైనా జీవం పోసేవారు సీనియర్ ఎన్టీఆర్
పౌరాణిక, కుటుంబ, సాంఘికం జానర్ ఏదైనా ఆయన వాటికి అనుగుణంగా పాత్రను ఎంచుకొని బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేందుకు తీవ్రంగా శ్రమించేవాడు. నాయకుడు, ప్రతి నాయకుడి పాత్రల ట్రెండ్ టాలీవుడ్ లో బహూషా ఆయనే ప్రారంభించారని చెప్పవచ్చేమో. రాముడు ఆయనే.. రావణాసురుడు కూడా ఆయనే. కృష్ణుడు ఆయనే.. దుర్యోధనుడు కూడా ఆయనే..
వీటితో పాటు శివుడి పాత్రలో నటించిన ఎన్టీఆర్. శివుడికి అత్యంత భక్తుడు రావణ బ్రహ్మ పాత్రలో కూడా ఆయనే నటించి మెప్పించారు. ఇలా భగవంతుడు, భక్తుడు.. రెండు పాత్రాల్లోనూ నటించి నట విశ్వరూపం చూపించి, ప్రేక్షకులను తన్మయానికి గురి చేయడం ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం.