AP Police Act : నగ్నంగా తిప్పుతూ.. బూటు కాళ్లతో తంతూ.. ఏపీ పోలీసుల దాష్టీకం

AP police act

AP police act, Naked Man

AP police Act :  ‘‘ఇక్కడ ప్రజలే ప్రభువులు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం.. ప్రజల సేవలో ప్రభుత్వం ’’ ఇవన్నీ ఒట్టిమాటలేనా. సామాన్య ప్రజలకు రక్షణ లేదా? ప్రశ్నించిన వారిపై దాడి చేయడమేనా ప్రజాస్వామ్యం.. ఈ దేశం ప్రజలదా..? లేకుంటే ప్రజాప్రతినిధులు, పాలకులదా..? వీరు ప్రజాసేవకులుగా ఉన్నారా లేదా ప్రజా కంటకులుగా ఉన్నారా? ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛగా ఉండే హక్కే లేదా.. ఏ కాలంలో ఉన్నాం మనం?

పైన చెప్పిన అన్ని హక్కులను ఉల్లంఘించడంలో ఏపీ పోలీసులు, పాలకులు ముందున్నారు. అధికార పార్టీ సేవలో పోలీస్ యంత్రాంగం తరించిపోతోంది. ప్రశ్నించిన ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను అణిచివేస్తున్నారు. దీనికి అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

మండలంలోని పాల్తూరు స్టేషన్ పోలీసులు చీకలగురికి గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే టీడీపీ కార్యకర్తను బట్టలు ఊడదీయించి.. బూటుకాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ.. స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పారు. వైసీపీ జెండాను తొలగించి దాని స్థానంలో జాతీయ జెండా ఎగురవేయాలని కోరాడని.. అతడిపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు చంద్రమోహన్ పక్కటెముక విరిగినప్పటికీ.. అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈనెల 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చంద్రమోహన్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి చీకలగురికి గ్రామ సచివాలయం ముందున్న వైసీపీ జెండాను తొలగించి, జాతీయ జెండా ఎగురవేయాలని టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ వైసీపీ కార్యకర్తలను కోరాడు. వారు ఒప్పుకోకపోవడంతో వైసీపీ జెండాను కిందకు దించకపోతే.. తానే తొలగించి తగలబెట్టిస్తానని చంద్రమోహన్ వారికి చెప్పాడు. దీంతో వారు చంద్రమోహన్ తో వాగ్వాదానికి దిగారు. అనంతరం పార్టీ జెండాను తొలగించి చంద్రమోహన్ తగులబెట్టాడని వైసీపీ కార్యకర్తలు పాల్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు జనవరి 1న చంద్రమోహన్ ను అదుపులో తీసుకున్నారు. తనను ఎందుకు స్టేషన్ కు తీసుకెళ్తున్నారంటూ అతడు ప్రశ్నించడంతో.. తమకే ఎదురు మాట్లాడుతావా? అంటూ చంద్రమోహన్ దుస్తులు ఊడదీయించి, బూటు కాళ్లతో తంతూ, పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. అంతటితో ఆగకుండా స్టేషన్ ప్రాంగణంలో నగ్నంతా తిప్పుతూ చితకబాదారు. అరెస్ట్ చూపి జైలుకు తరలించగా 4వ తేదీన ఉరవకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.

అయితే పోలీసుల దెబ్బలకు ఒళ్లంతా హునమై.. ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని అదేరోజు కుటుంబ సభ్యులు ఉరవకొండ హాస్పిటల్ లో చేర్పించారు. కాగా, పాల్తూరు పోలీసులు చంద్రమోహన్ ను నగ్నంగా తిప్పుతూ కొట్టిన సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా.. తాము చంద్రమోహన్ ను కొట్టలేదని, కేసు నమోదు చేసి జైలుకు పంపామని చెప్పారు.

ఈ ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం కూడా లేదా? ఏపీలో ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా? ఇదెక్కడి అరాచకం అంటూ ప్రజాస్వామికవాదులు పోలీసులపై మండిపడుతున్నారు.

TAGS