Yuvagalam:నారా లోకేష్ యువగళం ముగింపు సభకు ప్రత్యేక రైళ్లు
Yuvagalam:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన యాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. అయితే లోకేశ్ పాదయాత్ర మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, యువగళం విజయోత్సవ సభను డిసెంబరు 20న భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వస్తుండడంతో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి.
చంద్రబాబు, పవన్, లోకేశ్, నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక మీదికి వస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో, టిడిపి 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు డిసెంబరు 19న తిరుపతి, రైల్వే కోడూరు, మాచర్ల, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఆదోని నుంచి బయల్దేరి విజయనగరం చేరుకుంటాయి. అంతేకాదు, ఆర్టీసీ నుంచి అద్దె బస్సులు ఇవ్వాలని టీడీపీ ఇప్పటికే అధికారులను కోరింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ముగింపు యాత్ర టీడీపీ కి మరింత బూస్ట్ అవుతుందని చెప్పక తప్పదు.