Secunderabad to Tirupati : స్కూళ్లలో, కాలేజీల్లో వేసవి సెలవులు ఇచ్చేశారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. సెలవుల్లో ఎక్కువ మంది కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతారు. తిరుపతి వెళ్లే ఏ రైలుకూ రిజర్వేషన్ దొరకడం కష్టమే. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు తిరుమల వెళ్లేవారి కోసం ప్రత్యేక రైలును ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ఈ రైలు అందుబాటులోకి వచ్చింది.
నెం.07489 రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మే 11వ తేదీన అందుబాటులో ఉంటుంది. రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరి తర్వాత ర్ోజు ఉదయం 9.30 గంటలకు తీరుపతికి చేరుకుంటుంది. కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, రాయచూర్ జంక్షన్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
నెం. 07490 తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు మే 13న ఈ రైలు ఉంటుంది. రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మౌలాలి స్టేషన్లలో ఆగుతుంది.