Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా అన్న, సీఎం జగన్ పై రోజురోజుకూ విమర్శల ధాటిని పెంచుతున్నారు. జగన్ పాలన వైఫల్యాలను ఎండగట్టడమే కాదు.. కుటుంబం విడిపోవడానికి కారణం జగనే అంటూ నైతికంగా జగన్ ను దెబ్బతీస్తున్నారు. సాక్షిలో తనకు వాటా ఉందని.. జగన్ తనను మోసం చేశాడని..ఆయన క్యారెక్టర్ ఇలాంటిది అని జనాలకు చెప్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై పోరు సాగిస్తూనే కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రత్యేక హోదా అస్త్రాన్ని ప్రయోగించేందుకు షర్మిల రెడీ అయ్యారు. దీన్నే తమ ఎన్నికల ఎజెండాగా తీసుకెళ్లాలని ఆమె భావిస్తున్నారు. ఈమేరకు ఢిల్లీలో ధర్నాకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ప్రత్యేక హోదాపై ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలను ఢిల్లీకి రావాలని ఆదేశించారు. కొంతమంది ఏఐసీసీ నేతలు కూడా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది.
వైసీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని.. కేంద్రంలో ఎల్లయ్య ఉన్నా మల్లయ్య ఉన్నా మెడలు వంచుతానని జగన్ రెడ్డి ప్రగల్భాలకు పోయారు. తీరా గెలిచిన తర్వాత బీజేపీకి లొంగిపోయారు. ప్రత్యేక హోదాను అడిగిన పాపాన పోలేదు. కానీ తన రాజకీయ అవసరాలు.. కేసుల విషయంలో మాత్రం చాలా వరకూ ప్రయోజనాలు పొందారు. తన వరకూ ప్రత్యేక హోదా సాధించుకున్నారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని షర్మిల అందుకుంటున్నారు. జగన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ.. ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో దీక్ష నిర్వహించడం ద్వారా.. మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని హైలెట్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. గతంలోనూ అదే ప్రధాన హామీగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఆ హామీకి విలువ లభించలేదు. కానీ ఇప్పుడు షర్మల లాంటి నాయకత్వం రావడంతో.. హోదా అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. షర్మిల కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేయాలనుకుంటున్నారు. ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. హోదా అంశంపై చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు జరిగే అవకాశం ఉంటుందనే చెప్పాలి.