Ayodhya Ram Mandhir : అయోధ్య విశేషాలు.. అనాటి నుంచి ఆలయ నిర్మాణం దాకా..

Ayodhya Ram Mandhir

Ayodhya Ram Mandhir

Ayodhya Ram Mandhir : అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవ వేడుకకు మరో 16 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే దేశంలో అయోధ్య నుంచి ప్రతీ గ్రామానికి వెళ్లిన అక్షింతలు పంచుతున్నారు. ప్రతీ హిందూ కుటుంబం ఈ వేడుకల్లో భాగస్వామి అయ్యేలా ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. అందుకే ఇంటింటికీ అక్షింతల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహ దేశంలోని ప్రముఖులు హాజరుకానున్నారు. కోట్లాది మంది టీవీల్లో వీక్షించనున్నారు. ఈ వేడుక తర్వాత మాత్రమే సాధారణ భక్తులు రామయ్యను దర్శించుకునే వీలుంది. హిందువులకు ఎంతో కీలకమైన అయోధ్య ఆలయ విశేషాలను సంవత్సరాల వారీగా ఒకసారి చూద్దాం..

– 1528 సంవత్సరంలో బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి కమాండర్ మీర్ బాకీ నిర్మించారు. అతడే ఈ మసీదుకు బాబ్రీ అని పేరు పెట్టారు.

-1885 లో రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. బాబ్రీ మసీదు పక్కనే రామాలయం నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్ దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు.

-1949 లో వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు.

-1950లో గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపథ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు.

-1950లోనే పరమహంస రామచంద్ర దాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాలంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఇదే రామమందిర ఉద్యమానికి పురుడు పోసింది.

-1959 లో వివాదస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది.

-1981లో యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది.

-1986 ఫిబ్రవరి 1న హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

-1989లో హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతధ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.

-1992 డిసెంబర్ 6న ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురైంది. దీంతో రామమందిర ఉద్యమం మరింత ఊపందుకుంది.

-2002 ఈ వ్యవహరం అలహాబాద్ హైకోర్టుకు చేరింది.  వివాదస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది.

– 2010లో అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30న తీర్పు వెలువరించింది. వివాదస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

-2011 మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు నిలిపివేసింది.

-2018 ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీం విచారణ ప్రారంభించింది.

-2019ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంలో రోజువారీ విచారణ ప్రారంభం. నవంబర్ 9న సుప్రీంకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామజన్మభూమికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల స్థాలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని సుప్రీం ఆదేశించింది. ఈ తీర్పు తర్వాత అయోధ్య రామమందిర నిర్మాణానికి అడుగులు పడ్డాయి.

TAGS