Telangana : దాదాపు రెండు నెలలుగా ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఎడారి దేశమైన రాజస్తాన్ లో దాదాపు 52 డిగ్రీల వరకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు బయటకు రావడం లేదు. వీలైనంత వరకు ఉదయం, రాత్రి వేళ్లల్లో మాత్రమే అవసరాల కోసం బయటకు వస్తున్నారు. ఈ సంవత్సరం (2024) ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. ఉదయం 6 గంటల నుంచే పెరుగుతున్న వేడి రాత్రి 8 గంటలైనా తగ్గడం లేదు. ఈ ఎండలకు చాలా మంది వడదెబ్బకు బలయ్యారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లటి కబురు తెచ్చింది.
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మే 31న కేరళను తాగిన రుతుపవనాలు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. నాగర్‌కర్నూల్, గద్వాల్, నల్గొండలో ప్రవేశించాయి. ఇప్పుడు రాష్ట్రం అంతటా చురుకుగా కదులుతున్నాయి. జూన్ 2వ వారంలో తెలంగాణకు రుతుపవనాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది వారం ముందే ప్రవేశించాయి. ఈ సారి సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం (జూన్ 03) తేలికపాటి నుంచి మోస్తరు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. మంగళవారం (జూన్ 04) నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ ఐఎండీ స్పష్టం చేసింది.
1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత ‘లానినా’ వచ్చిన సందర్భాల్లో భారత్‌లో 9 సార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని ఐఎండీ వివరించింది.