OTT : ఓటీటీలో దక్షిణాది సత్తా.. దూసుకెళ్తున్న సలార్, హాయ్ నాన్న
OTT : కొంత కాలం నుంచి మూవీ ఇండస్ట్రీలో దక్షిణాది హవా కొనసాగుతోంది. ఉత్తరాది, బాలీవుడ్ కంటే దక్షిణాదికి చెందిన సినిమాలే వరల్డ్ వైడ్ సంచలనాలుగా నిలుస్తున్నాయి. బాహుబలి నుంచి ఈ హవా జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇండియన్ ఇండస్ట్రీలోకి వచ్చిన రెండు ఆస్కార్ అవార్డులు దక్షిణాది వారినే వరించడం దీన్ని నిరూపిస్తుంది.
ఈ హవా థియేటర్ల రిలీజ్ విషయంలో కాకుండా ఓటీటీలో కూడా కొనసాగుతుంది. సౌత్ ఇండియన్ సినిమాలు ఇండియన్ సినిమా ముఖచిత్రంగా దాదాపుగా మారిపోయాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారా వంటి సినిమాల బ్లాక్ బస్టర్ విజయాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
ఇప్పుడు ఓటీటీ రంగంలోనూ సౌత్ ఇండియన్ సినిమాలు డామినేట్ చేయడం మొదలుపెట్టాయి. ప్రభాస్ నటించిన సలార్, నాని నటించిన హాయ్ నాన్న సినిమాలు నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 లిస్ట్ లో నాలుగు స్థానాలు దక్కించుకుని సౌత్ సినిమా సత్తా ఏంటో నిరూపించాయి.
నాని నటించిన ‘హాయ్ నాన్న’ జనవరి 4న నెట్ ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. వరుసగా మూడో వారం నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 చార్టుల్లో పదిలంగా ఉంది. హిందీ వెర్షన్ ‘హాయ్ పాపా’ మూడో స్థానంలో నిలవగా, తెలుగు వెర్షన్ ‘హాయ్ నాన్న’ ఆరో స్థానంలో నిలిచింది.
జనవరి 20న ఇదే నెట్ ఫ్లిక్స్ లోకి ‘సలార్’ ప్రీమియర్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలో చాలా మంది చూశారు. ఫలితంగా ‘సలార్’ తెలుగు వెర్షన్ టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లో అగ్రస్థానంలో నిలవగా, తమిళ వెర్షన్ ఐదో స్థానంలో నిలిచింది.