Bollywood stars : బాలీవుడ్ తారలకు కలిసి వస్తున్న సౌత్ ఇండస్ట్రీ.. కారణాలు ఇవేనట..
Bollywood stars : సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ, దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ తారలు ఇటీవల భారీ బడ్జెట్ దక్షిణాది చిత్రాల్లో కనిపిస్తున్నారు. ఈ పాత్రలు పోషించినందుకు వారి సాధారణ పారితోషికం కంటే రెట్టింపు తీసుకుంటున్నారు. పైగా వారు లీడ్ రోల్స్ కాకుండా కేవలం గెస్ట్ పాత్రలు, కొంత సేపు ఉండే పాత్రలు మాత్రమే చేస్తున్నారు. తక్కువ డేట్స్ మాత్రమే దక్షిణాది దర్శకులకు ఇస్తున్నారు. సౌత్ స్టార్స్ ఈ భారీ ప్రాజెక్టుల్లో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అయితే, పాపులర్ బాలీవుడ్ ముఖాలను పెట్టుకుంటే హిందీ, అంతర్జాతీయ మార్కెట్లను ఆక్రమించుకోవాలనుకునే సౌత్ మేకర్స్ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ తారలు పొందే అధిక పారితోషికం వారు ఈ చిత్రాలకు తీసుకువచ్చే అదనపు మార్కెట్ విలువను జోడిస్తోంది. బాలీవుడ్ నటులకు, ఒక సౌత్ ప్రాజెక్ట్ షూటింగ్ సాధారణంగా హిందీ సినిమాకు ఇచ్చే డేట్స్ రెండు, మూడు నెలలతో పోలిస్తే 30 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇది వారికి మరింత ఆకర్షణగా కనిపిస్తుంది. తక్కువ పని ఎక్కువ డబ్బు వారిని సౌత్ వైపునకు నడిపిస్తోంది.
ముఖ్యంగా హిందీ బెల్ట్ లో తమ సినిమాల పరిధిని విస్తరించేందుకు బాలీవుడ్ తారలను గేట్ వేగా సౌత్ ఫిల్మ్ మేకర్స్ చూస్తారు. ఒక బాలీవుడ్ నటుడిని నటింపజేయడం వల్ల ఉత్తరాదిలో ఈ చిత్రం అప్పీల్ పెరుగుతుంది, ఇది థియేట్రికల్ అమ్మకాలు, ఓటీటీ హక్కులు, సంగీత అమ్మకాల నుంచి ఆదాయాన్ని పెంచుతుంది. క్రాస్ ఓవర్ రెండు విధాలుగా పనిచేస్తుందని ట్రేడ్ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.
బాలీవుడ్ తారలకు దక్షిణాది సినిమాలు కొత్త ప్రేక్షకులకు చేరువ కావడానికి, తమను తాము నిరూపించుకునే అవకాశం కల్పిస్తాయి. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మీ, సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ వంటి స్టార్ హీరోలు ఇప్పుడు హిందీ చిత్రాల్లో నటించడం లేదు. ఇప్పుడు విలన్ పాత్రల ద్వారా సౌత్ ఇండస్ట్రీలో కొత్త కెరియర్ ను వారు ప్రారంభించారు.
ఉదాహరణకు సంజయ్ దత్ కేజీఎఫ్, లియో చిత్రాల్లో విలన్ గా నటించగా, సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ ఇటీవల దేవర, కంగువా వంటి చిత్రాల్లో నటించారు. దక్షిణాది సినిమాల ఆకర్షణ వారి అధిక రెమ్యునరేషన్లు, పాన్ ఇండియా విడుదలలో మాత్రమే కాకుండా నమ్మకమైన, వేగవంతమైన చెల్లింపులు, సజావుగా షూటింగ్ షెడ్యూల్ లో కూడా ఉందని, ఇది బాలీవుడ్ తారలు పాత్రలను అంగీకరించుకునేందుకు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని పరిశ్రమ నిపుణులు వివరిస్తున్నారు.