Devadaya Department : త్వరలో దేవాదాయశాఖలో 500 పోస్టుల భర్తీ

Devadaya Department
Devadaya Department Posts : ఏపీ దేవాదాయశాఖలో ఖాళీగా ఉన్న వివిధ కేడర్లలోని అధికారులు, అర్చకులకు సంబంధించిన 500 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేవాదాయశాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న అర్చక విభాగం, పరిపాన పరమైన సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయాలన్నీ పరిశుభ్రత, ఆధ్యాత్మికతలో కళకళలాడేట్లుగా అధికారులందరూ పని చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రంలోని దేవాదాయశాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రూ.50 వేలకు పైగా వార్షికాదాయం ఉన్న ఆలయాల్లో అర్చకుల వేతనం రూ.15 వేలకు పెంపు, వేదాధ్యయనం చేసిన వేద పండితులకు సంభావన కింద రూ.3 వేలు నిరుద్యోగ భృతి చెల్లించేలా ఉత్తర్వులిచ్చామన్నారు. ఆలయాల ట్రస్టు బోర్డుల్లో అదనంగా ఇద్దరు సభ్యుల నియామకానికి సంబంధించి త్వరలో ఆర్డినెన్స్ జారీ కానుందన్నారు. ఈ సమీక్షలో దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, అదనపు కమిషనర్లు చంద్రకుమార్, రామచంద్రమోహన్ లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.