Sonia Gandhi : తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కొత్త వ్యూహాలు రెడీ చేస్తోంది. దక్షిణాదిన పూర్తి పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాంతంలో బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్సై బలంగా ఉంది. కర్నాటక, తెలంగాణలో స్వయంగా ఆ పార్టే అధికారంలో ఉండడం.. కేరళ, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారంలో ఉండడంతో ఆ పార్టీ సౌత్ నుంచి భారీగా సీట్లు రాబట్టాలని యోచిస్తోంది. ఏపీ నుంచి షర్మిల కాంగ్రెస్ లో చేరడం కూడా ఆ పార్టీకి మునపటి కన్నా కాస్త ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది.
దక్షిణాదిలో పాగా కోసమే..
దక్షిణాదిలో పార్టీ పట్టును మరింత పెంచేందుకు సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీచేయాలని కొంతకాలంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుతోంది. రీసెంట్ గానే తీర్మానం చేసి మరి హైకమాండ్ కు పంపించింది కూడా. దీంతో పోటీకి సోనియా సూత్రప్రాయంగా అంగీకరించారని సమాచారం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై చర్చ జరగ్గా.. చివరకు ఖమ్మం నుంచి పోటీ చేస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు హైకమాండ్ నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఖమ్మం పోటీ నుంచి పోటీకి సోనియా అంగీకరించారని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించాలని సూచించారట. దీంతో రాష్ట్ర నేతలు ఈ విషయంపై దృష్టి సారించారు.
అందుకే ఖమ్మం నుంచి..
మిగతా లోక్ సభ స్థానాల కన్నా ఖమ్మం నుంచి పోటీ వైపు మొగ్గు చూపడానికి పలు కారణాలున్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్లలో కాంగ్రెస్ సానుకూలతను పెంచవచ్చు. ఖమ్మంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. బీజేపీ ఇక్కడ అంతంత మాత్రమే. ఇక బీఆర్ఎస్ కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే సోనియా గెలుపు నల్లేరుపై నడకే అని అంటున్నారు. దీంతో పాటు సోనియా పోటీ వల్ల దక్షిణాదికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యమిస్తోందనే పాజిటివ్ వైబ్స్ ను ఓటర్లకు పంపవచ్చు. తద్వారా ఎక్కువ సీట్లు సాధించి బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
ఇక దక్షిణాది నుంచి సోనియా గతంలో కూడా పోటీ చేశారు. 1999లో బళ్లారి నియోజకవర్గం నుంచి సుష్మా స్వరాజ్ పై పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి బరిలో ఉండబోతున్నారు. ఇందిరాగాంధీ కూడా గతంలో కర్నాటకలోనూ, తెలంగాణలోని మెదక్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడదే వారసత్వాన్ని సోనియా కూడా కార్యాచరణలోకి తీసుకొస్తున్నారు.