JAISW News Telugu

Kashmir : కశ్మీర్‌లో మంచు కనిపించని శీతాకాలం.. ఈ ఏడాదే ఎందుకిలా?

Snowless winter in Kashmir

Snowless winter in Kashmir

Kashmir : కాశ్మీర్ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది నేల కనిపించకుండా ఉన్న మంచు. కానీ ఇప్పుడు చలికాలం వచ్చినా మంచు కురియలేదు. గుల్మార్గ్‌లో 17 సంవత్సరాలుగా హోటల్ నిర్వహిస్తున్న తాను మంచుకురవని చలికాలాన్ని మొదటి సారి చూశానని మంజూర్ అహ్మద్ అన్నాడు. కానీ ఈ ఏడాది పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మంచుతో కప్పి తెల్లగా కనిపించాల్సిన పర్వతాలు బోసిపోయి గోధుమ వర్ణంలో బంజరు భూములను తలపిస్తున్నాయి. దీనివల్ల పర్యాటకుల సంఖ్య చాలా వరకు తగ్గిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జమ్ము-కశ్మీర్ జీడీపీలో పర్యాటక రంగం వాటా 7శాతం కన్నా ఎక్కువే. కానీ మంచు లేకపోవడంతో పర్యటకుల సంఖ్య తగ్గి ఆర్థిక రంగంపై భారం పడుతుదని నిపుణులు పేర్కొంటున్నారు. మంచు కురియకపోవడం కేవలం పర్యాటక రంగమే కాక అక్కడి  పంటలు, తాగునీటి సరఫరాపైనా పడిందని స్థానికులు అంటున్నారు. భూ గర్భ జలాశయాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటకుల తిరుగుముఖం
పర్యాటకులు వారి రిజర్వేషన్లను రద్దు చేసుకుంటున్నారని హోటల్ల యజమానులు చెబుతున్నారు. ఇప్పటికే వచ్చిన వారు స్కీయింగ్, గుర్రపు బగ్గీ ప్రయాణాలు లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ‘40 శాతానికి పైగా హోటల్ రిజర్వేషన్లు రద్దయ్యాయి. కొత్త రిజర్వేషన్ల ఊసే లేదు’ అని గుల్మార్గ్ హోటల్స్ క్లబ్ అధ్యక్షుడు అకిబ్ చాయా అన్నారు.

కశ్మీర్‌ అందాలను సందర్శించేందుకు వచ్చిన తమకు నిరాశే ఎదురైందని మహారాష్ట్రకు చెందిన రాజ్‌కుమార్ అన్నారు. ‘ఇక్కడ కురిసే హిమపాతం చూద్దామని వచ్చా. కేబుల్ కారులో ప్రయాణం చేయాలనుకున్నా, మంచులేని గుల్మార్గ్‌ను చూసి చూడాల్సి వచ్చింది.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

కరువు తప్పదా?
హిమ పాతం లోటు పర్యాటక రంగంపైననే కాకుండా జల విద్యత్ ఉత్పత్తి, చేపలు, సాగుకు కూడా నష్టం కలిగిస్తోంది. ‘ఇక్కడి వ్యవసాయమంతా హిమనీనదాలపై ఆధారపడి సాగుతుంది. దీంతో ఇవి వేగంగా కరిగిపోతున్నాయి. శీతాకాలంలో హిమ పాతం లేకుంటే నీటి బుగ్గలకు సమస్యగా మారుతుంది’ అని పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ చెప్పారు. ‘హిమాలయ ప్రాంతాల్లో అత్యంత పొడిబారిన కాలమిదే’  అని లేహ్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ సోనమల్ లోటస్ అన్నారు. ‘కరువులాంటి పరిస్థితులను కొట్టిపారేయలేం’ అని కశ్మీర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇర్ఫాన్ రషీద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సాధారణంగా ఈ ప్రాంతంలో డిసెంబర్ 21 నుంచి జనవరి 29 మధ్య 40 రోజుల పాటు భారీగా మంచు పడుతుంది. ఈ సమయంలో పర్వతాలు, హిమనీ నదులు మంచుతో నిండిపోతాయి. దీంతో ఏడాదంతా నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తేంది. కొన్నేళ్లుగా హిమపాతం తగ్గుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు.

‘1990కు ముందు హిమపాతం ఎక్కువగా ఉండేది. 3 అడుగుల మందాన మంచు కురిసేది. వేసవి వచ్చే వరకూ కరిగేది కాదు. కానీ ఇప్పుడు వెచ్చటి శీతాకాలాన్ని చూడాల్సి వస్తోంది’ భూ శాస్త్రవేత్త షకీల్ అహ్మద్ రమ్షూ అన్నారు. రమ్షూ, ఆయన బృందం చేసిన అధ్యయనం ప్రకారం లడఖ్‌ సహా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఈ శతాబ్దం చివరికి ప్రమాదకర స్థాయికి చేరతాయని, ఉష్ణోగ్రతలు 3.98 నుంచి 6.93 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Exit mobile version