Smita Sabharwal : మంటలు రేపుతున్న స్మితా సబర్వాల్ మాటలు..ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
Smita Sabharwal : ఆలిండియా సర్వీసుల ఎంపికలో వికలాంగులకు కోటా కల్పించడంపై తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంగవైకల్యం ఉన్నవారిని అవమానించారని, వారి సామర్థ్యాలను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను రాజకీయ నాయకులు, న్యాయవాదులు, వికలాంగుల సంఘాల ప్రతినిధులు తప్పుబట్టారు. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూజా ఖేద్కర్ అడ్డదారిలో ఎంపిక కావడం, ట్రైనీగా ఉన్న సమయంలో చెలరేగిపోలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఎక్స్ లో వరుస ట్వీట్లు చేశారు. వికలాంగుల పట్ల తనకు గౌరవం ఉందని పేర్కొన్న స్మిత.. ఆలిండియా సర్వీసుల్లో వారి ఎంపికను తప్పుపట్టారు.
విమానయాన సంస్థలు వికలాంగ పైలట్లను నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్‌ని మీరు విశ్వసిస్తారా? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ వంటి ఆలిండియా సర్వీసులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, రోజుకు చాలా గంటలు ప్రయాణించాలని, ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాలని, ఈ ఉద్యోగాలకు అంగ బలం ఎంతో అవసరమని, వికలాంగులకు కోటా ఎందుకు అని ప్రశ్నించారు. కొన్నిసార్లు కష్ట సమయాల్లో పనిచేయాల్సి వస్తుందని తన ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నానని, కానీ వైకల్యం ఉన్న పైలట్‌ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవలను మీరు విశ్వసిస్తారా? అని స్మితా ప్రశ్నించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై ట్విటర్‌లో.. వెలుపల తీవ్ర విమర్శలు వచ్చాయి. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి. ఆమె ప్రవర్తనను పలువురు ఖండించారు. కొంతమంది బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలు, ప్రత్యేకాధికారాలను ఎలా ప్రదర్శిస్తున్నారో స్మిత పోస్ట్ చూస్తే అర్థమవుతుంది’’ అని ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. తెలంగాణ వికలాంగుల ఆర్థిక సహకార సంఘం చైర్మన్ వీరయ్య ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సివిల్ సెలక్షన్స్‌లో వికలాంగులకు రిజర్వేషన్లపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మాజీ సివిల్ సర్వెంట్, సివిల్స్ పరీక్షల బోధకురాలు బాలలత డిమాండ్ చేశారు. ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. ప్రత్యేక చట్టం ద్వారా అమల్లోకి తెచ్చిన వికలాంగుల కోటాపై ఓ ఉన్నతాధికారి ఈ విధంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. స్మిత వ్యాఖ్యలతో సమాజంలో వికలాంగులను చిన్నచూపు చూసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగులకు క్షమాపణలు చెప్పాలని పలు సంఘాలు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నాయి.