Smita Sabharwal : మాజీ ఐఏఎస్ బాలలత సవాల్ స్వీకరిస్తున్నట్లు స్మితా సబర్వాల్ ప్రకటన
Smita Sabharwal : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్‌లో వికలాంగులకు కోటా అవసరమా అని ఆమె ట్వీట్ చేసింది. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్‌పై రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలపై సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ చీఫ్, మెంటర్ బాలలత తీవ్రంగా స్పందించారు. సివిల్ సర్వీసెస్ లో వికలాంగుల కోట సమస్యపై స్పందించేందుకు కోర్టులు, చట్టసభలు ఉన్నాయని ఆమె ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య పదవిలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటి పోస్టు పెట్టడం దారుణమన్నారు. ఆమెపై సీఎం రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్మితపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే ట్యాంక్ బండ్ పై ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక ప్రభుత్వ అభిప్రాయాలా? అని ప్రశ్నించారు. స్మితా సబర్వాల్‌కు దమ్ముంటే తనతో కలిసి పరీక్షలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్‌పై స్పందించిన ఐఏఎస్ స్మిత.. ట్వీట్ చేశారు. సివిల్స్ పరీక్షలు రాసేందుకు తాను సిద్ధమే కానీ.. వయస్సు పెరిగిన దృష్ట్యా యూపీఎస్సి అనుమతించదేమో అని స్మితా ట్విట్ చేసింది. ఇక ఈ ట్వీట్ లో బాలలతను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. దివ్యంగుల కోటాలో బాలలత తన ప్రత్యేక హక్కును దేనికి ఉపయోగించింది..? కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నడపడానికా..? లేక ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికా..? అంటూ ఓ నెటిజన్ ను స్మితా సబర్వాల్ ప్రశ్నించింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉంటే స్మితా సబర్వాల్ వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉమ్మడి ఏపీ వికలాంగుల సంస్థ చైర్మన్, టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సాయిబాబా డిమాండ్ చేశారు. వికలాంగులను చిన్నచూపు చూడటం తగదని సూచించారు. స్మిత అహంకారానికి పాల్పడినందుకు చట్ట ప్రకారం ఆమెను శిక్షించాలని వికలాంగుల సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.