Maruti Alto : చిన్నబోతున్న చిన్న కార్లు..సేల్స్ తగ్గడానికి కారణాలివే..
Maruti Alto : గడిచిన కొన్నేళ్లుగా మారుతి ఆల్టో వంటి చిన్న కార్లకు డిమాండ్ భారీగా తగ్గుతూ వస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం.. రూ.5 లక్షల లోపు విలువైన కార్ల మార్కెట్ వాటా 2015లో 33.6 శాతంగా ఉండగా.. గతేడాదిలో ఏకంగా 0.3 శాతానికి పడిపోయింది. కొనుగోలుదారులు సన్ రూఫ్ వంటి హంగులతో పాటు ఆధునిక సాంకేతికత, భద్రతా ఫీచర్లు కలిగిన హైఎండ్ మోడళ్ల వైపే మొగ్గు చూపుతుండడంతో చిన్న కార్లు ఆదరణ కోల్పోయాయి. వాహన తయారీలో ఉపయోగించే కమోడిటీల ధరలు భారీగా పెరగడంతో పాటు ప్రభుత్వం భద్రత ప్రమాణాలను పెంచడం కూడా ఈ విభాగ కార్ల విక్రయాలకు పరోక్షంగా గండికొట్టాయి. స్మాల్ కార్ సెగ్మెంట్లలో ప్రస్తుతం మారుతి సుజుకీ ఆల్టో, రెనో క్విడ్ మాత్రమే మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.
గడిచిన ఐదేండ్లలో రూ.5లక్షల లోపు విలువైన కార్ల ధరలు ఏకంగా 65 శాతం పెరగగా.. సెడాన్ లు, ఎస్ యూవీలు, లగ్జరీ కార్ల రేట్లు మాత్రం 24 శాతం వరకు పెరిగాయి. చిన్న కార్ల ధరలు పెరిగినంత వేగంగా ఆ సెగ్మెంట్ కస్టమర్ల ఆదాయాలు పెరగకపోవడం కూడా విక్రయాలపై చూపిందని మార్కెట్ పరిశోధక సంస్థ జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా అన్నారు. కార్ల ధరలతో పాటు వాటి నిర్వహణ ఖర్చులు సైతం గణనీయంగా పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు సర్వీస్, మరమ్మతు చార్జీలు, విడిభాగాలు, టైర్ల ధరలు కూడా అనూహ్యంగా పెరగడంతో మధ్యతరగతి వర్గంలో చాలా మంది కారు కొనగలిగే స్థోమత ఉన్నప్పటికీ నిర్వహణ వ్యయాలకు భయపడి నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారని తెలిపారు.
కరోనా సంక్షోభం తర్వాత అల్పాదాయ వర్గాల రాబడి మరింత తగ్గడంపై చిన్న కార్ల డిమాండ్ పై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కారు కొనుగోలు దారుల్లో చాలా మంది బేస్ వేరియంట్ల కంటే కనెక్టివిటీ, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఎస్ యూవీ డిజైన్, 360 డిగ్రీస్ కెమెరా, సన్ రూఫ్ వంటి ఆధునిక ఫీచర్లున్న మోడల్స్ ను ఇష్టపడుతున్నారని అంటున్నారు. ఇందుకు అధిక మొత్తంలో చెల్లించేందుకూ వెనకాడడం లేదన్నారు. దీంతో 10 లక్షలకు పైగా విలువ చేసే కార్ల మార్కెట్ వాటా 2015లో కేవలం 12.5శాతం ఉండగా, 2023 చివరి నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 46 శాతం చేరుకుంది.