Tim Cook : యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీల్లో పనిచేయాలంటే స్కిల్స్ ఉండాలి : టీమ్ కుక్

Tim Cook

Apple CEO Tim Cook

Tim Cook : అధిక సంపాదన, ఉద్యోగ భద్రత కల్పించే మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అదే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న  యాపిల్‌ లాంటి దిగ్గజ కంపెనీలో పనిచేయాలని కలలు కనని వారుండరు. కానీ, అందరికీ అలాంటి ఛాన్స్ రాదు కదా ! నిత్యం వినూత్న ఆవిష్కరణలు, నాణ్యమైన ఉత్పత్తులకు చిరునామాగా నిలిచిన యాపిల్ లాంటి కంపెనీల్లో చేరాలంటే అందుకు తగ్గట్లే నైపుణ్యాలు కూడా మనలో ఉండాలి. మరి ఎలాంటి నైపుణ్యాలు సాధిస్తే యాపిల్ లాంటి కంపెనీల్లో అడుగుపెట్టగలం ? కొత్తగా చేరాలనుకొనేవారిలో ఎలాంటి నైపుణ్యాల కోసం కంపెనీ చూస్తుంది ? వంటి అంశాలపై స్వయంగా ఆ సంస్థ సీఈవో టీమ్ కుక్ తెలిపిన విషయాలు..

‘‘యాపిల్‌ కంపెనీ ఉద్యోగులందరిలో కామన్‌గా ఒకరికొకరు సహకరించుకుని పనిలో దూసుకుపోయే లక్షణం తప్పనిసరిగా ఉంటుంది. 1+1=3 అనే కాన్సెప్టుతో క్రిటికల్‌గా థింకింగ్‌ కలిగిన వారికి కంపెనీ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఒక్కొక్కరు తమ వ్యక్తిగత సామర్థ్యంతో పనిచేస్తే వచ్చే ఫలితం కన్నా అందరూ కలిసికట్టు గా పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి.  కొత్తగా తీసుకోబోయే వారిలోనూ ఇలా సమన్వయంతో పనిచేసే స్వభావం ఉందా? లేదా అనేది నిశితంగా పరిశీలిస్తాం’’ అన్నారు.

యాపిల్‌ కంపెనీలో పనిచేయాలంటే కచ్చితంగా కాలేజ్‌ డిగ్రీ ఉండాలా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘యాపిల్‌లో అన్ని రంగాల వారికీ ఉద్యోగాలు ఉంటాయి. ఈ క్రమంలో కాలేజ్‌ డిగ్రీ కచ్చితంగా అవసరంలేని వారు కూడా మా కంపెనీలో పని చేస్తున్నారు. అలాగే యాపిల్‌లో పనిచేసే వారికీ అత్యంత కీలకమైన నైపుణ్యాల్లో కోడింగ్‌ కూడా ఒకటి. అయితే, కోడింగ్‌పై పెద్దగా అవగాహనలేని వారు.. రోజువారీ కార్యకలాపాల్లో అంతగా కోడింగ్‌ ఉపయోగించని వారిని కూడా కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది. అనునిత్యం నేర్చుకుంటూ.. ప్రశ్నలు అడగడానికి సందేహించని వారిని నేను కోరుకుంటాను. అలాగే క్రియేటివిటీ బృందంలో కలిసి పనిచేసేవారి కోసమూ మేం అనునిత్యం అన్వేషిస్తాం’’ అని టీమ్ కుక్ వెల్లడించారు.

TAGS