Road Accident : ఏపీ పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం దగ్గర ఓ ప్రైవేటు బస్సు, టిప్పర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లతో సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి హైదరాబాదుకు బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్ బస్సు చిలుకలూరిపేట మండలం ఈవూరిపాలెం డొంక సమీపంలో టిప్పర్ ను ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్ తో పాటు మరో నలుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో బస్సు డ్రైవర్ అంజి, ఉప్పుగుండూరు కాశయ్య, ఉప్పుగుండూరు లక్ష్మి, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీగా గుర్తించారు. మిగతా ఇద్దరిని గుర్తించాల్సి ఉంది.
బస్సు డ్రైవర్ బస్సును స్పీడుగా నడిపినట్లు తెలుస్తోంది. చినగంజాంలో బయలుదేరినప్పటి నుంచి బస్సును డ్రైవర్ ఓవర్ స్పీడ్ గా నడిపినట్లు ప్రయాణికులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. బస్సు ప్రమాదం జరగగానే క్లీనర్ పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన ఏడుగురికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా వారిలో ఐదుగురిని ఇంటికి పంపించారు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు.