CM Revanth : పరిశ్రమ రంగంలో ఆరు కొత్త విధానాలు.. రేవంత్ రెడ్డి ప్లాన్ సూపర్
CM Revanth : తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ పోలింగ్ ముగియడంతో పాలనను పరుగులు పెట్టించాలని నిర్ణయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా పారిశ్రామిక రంగాలకు చెందిన ఆరు విధానాలకు సంబంధించి కొత్త విధానాలను రూపొందించామని త్వరలో ప్రకటిస్తామని సీఎం చెప్పారు. కొత్త విధానాలతో పారిశ్రామికంగా రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయమని ఆయన ధీమాగా చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పాలసీలు చేపట్టి పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తామని హామీ ఇస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ఒకటి, ఎంఎస్‌ఎంఇ రంగానికి ఒకటి, ఎగుమతుల కోసం ఒకటి సహా ఆరు కొత్త విధానాలను రూపొందిస్తుందని మంగళవారం ప్రకటించింది. కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, ఎలక్ట్రిక్ వాహనాల కోసం సవరించిన విధానం, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీని కూడా ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి మంగళవారం (మే 21) నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామికాభివృద్ధిలో ఇతర దేశాలతో పోటీపడేలా విధానాలు రూపొందించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న నూతన పారిశ్రామిక విధానానికి కొన్ని ప్రతిపాదనలు కూడా ఇచ్చామని సూచించారు.
ఇతర దేశాల్లోని అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలని ఆయన కోరారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను, పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు పవర్ లూమ్, చేనేత కార్మికులకు మేలు జరిగేలా కొత్త విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసేలోపు పారిశ్రామిక విధానాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.