Keeravani : కీరవాణి ఫామ్ హౌస్ లో ఒకప్పటి సిట్టింగ్
Keeravani : సినిమా విజయంలో తోడ్పడే ప్రధాన అంశం సంగీతం. పాటలు హిట్టయితే సగం సినిమా హిట్టయినట్లే. అందుకే దర్శక నిర్మాతలు ముందు సంగీతానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే పాటలు రికార్డ్ చేసే వాళ్లు. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో దర్శకుడు, గీత రచయితలు, గాయకులు, హీరోహీరోయిన్లు అందరూ కూర్చొని పాటల కోసం కసరత్తు చేసేవారు. ఒకప్పటి మేకర్స్ కు ఇదంతా ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయేవి. ఇటీవల సంగీత దర్శకుడు కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ విషయాల్ని గుర్తు చేసుకున్నారు కూడా. అయితే ప్రస్తుత సినిమాలో కీలక పాత్ర పోషించే ఒకప్పటి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రస్తుతం కనిపించడం లేదు. ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడి నుంచో ట్యూన్ పంపితే, దర్శకుడు దానిని ఫోన్లో విని ఫైనల్ చేస్తున్నాడు. ఇక గీత రచయితలు గోవా బీచ్‌లో కూర్చుని పాట రాసి పంపితే, చెన్నైలో ఉన్న గాయకుడు దాన్ని ఆలపిస్తున్నారు. వీటన్నింటిని కలిపి రికార్డింగ్ స్టూడియోలో పాట తయారు చేస్తున్నారు సంగీత దర్శకులు. దాంతో మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్న మజా ఇప్పటి దర్శకనిర్మాతలు, నటీనటులకు తెలియకుండా పోతున్నది.
అయితే చాలా కాలం తరవాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ‘విశ్వంభర’ కోసం మూవీ టీమ్ అంతా కూర్చుని పాటలపై కసరత్తు చేయడం ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకుంటున్నది. `విశ్వంభర` షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చింది చిత్రబృందం. ఈ బ్రేక్‌ని మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వినియోగించుకుంటున్నది. బెంగళూరులోని కీరవాణి ఫామ్ హౌస్ లో మెగాస్టార్ చిరంజీవి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రచయిత చంద్రబోస్, దర్శకుడు వశిష్ట, గాయకుడు రాహుల్, అంతా కలిసి పాట కట్టే పనిలో పడ్డారు. వారం పాటు అక్కడే మకాం వేసి, పాటల పని పట్టనున్నారు .ఆ తరవాత హైదరాబాద్ తిరిగి రానున్నారు. వచ్చాక పాటల్ని చిత్రీకరించనున్నారు. చాలా కాలం తరవాత ఇలా మూవీ టీమ్ అంతా కూర్చుని మ్యూజిక్ సిట్టింగ్స్ చేయడం మూవీ యూనిట్ కు మరింత బూస్ట్ ఇచ్చినట్లయ్యింది. త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం.