SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు..ఈసీ ఆదేశాలతో విచారణ
SIT Investigation : ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎన్నికల రోజు చెదురుముదురు ఘటనలు జరిగినా పెద్దగా నష్టం జరుగలేదు. కానీ ఎన్నికలు ముగిసినా తర్వాత అక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. ప్రస్తుతం ఏపీ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని ఆందోళన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ మొదలుకావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
అయితే ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ సిట్ ను వేయనుంది. ఎన్నికల తర్వాత జరిగిన ప్రతీ హింసాత్మక ఘటనపైనా సిట్ నివేదిక ఇవ్వనుంది.
పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్ విచారణ చేయనుంది. తాజాగా విశాఖలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తెచ్చే అంశంపైనా అధికారులు ఆలోచన చేస్తున్నారు. తాడిపత్రి ఘటనలో చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. ప్రతీ ఘటనపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. వివిధ ఘటనల్లో పోలీసు అధికారుల వైఫల్యం కనిపించడంతో ఇప్పటికే పలువురు అధికారులపై ఈసీ వేటు వేసింది.