SIT Investigation : ఏపీలో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి. అధికార పార్టీ.. కూటమి ఎన్నికల్లో గెలుపు కోసం తహతహలాడుతున్నాయి. పోలింగ్ రోజు కొన్ని జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది.
ముఖ్యంగా మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల పై సిట్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. దీంతో హింసకు బాధ్యులైన నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పల్నాడులో ఎన్నికల పోలింగ్ నుంచే చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు మొదలు పెట్టింది. దీంతో సిట్ ఏర్పాటు కన్నా ముందే స్థానికంగా ఉన్న నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే వారిని హౌస్ అరెస్టు చేసినా తప్పించుకుని మరీ పారిపోయారు. వీరిలో కొందరు హైదరాబాద్ కు, మరికొందరు ఇతర ప్రాంతాలకు పోయినట్లు తెలుస్తోంది. సిట్ దర్యాప్తులో తమ పేర్లు గనుకు బయటకు వస్తే అరెస్టులు తప్పవని నేతలు భయాందోళనకు గురవుతున్నారు.
అలాగే అటు రాయలసీమలోనూ పోలింగ్ డే నుంచే హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. ఆ సమయంలో అడ్డుకోవాల్సిన అక్కడి పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారు. దీనికి బాధ్యులను చేస్తూ ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపైనే ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈసారి వేటుతో సరిపెట్టకుండా సస్పెన్షన్ల వరకు వెళ్లింది. దాంతో సరిపుచ్చుకోకుండా శాఖాపరమైన విచారణ కూడా జరుపుతోంది. దీంతో తాడిపత్రి, చంద్రగిరిలో నేతలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. అన్నీ సవ్యంగా జరిగితే హింసకు కారణమైన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
హింసాత్మక ఘటనలపై రెండు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో.. అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈసీ ఇప్పటికే ఈ హింసపై సీరియస్ గా ఉండటంతో మరిన్ని చర్యలు ప్రకటించేలోపు తమ నివేదిక ఇచ్చేందుకు సిట్ కూడా రెడీ అవుతోంది. ఇవాళ దర్యాప్తు పూర్తి చేసి సాయంత్రం లేదా రేపటి వరకు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హింసకు కారకులను అరెస్టు చేసి కోర్టులో నిలబెట్టాల్సిన పరిస్థితి రావొచ్చు.