JAISW News Telugu

YCP : వైసీపీ పునాదులు కూల్చే పనిలో చెల్లెళ్లు..జగన్ ఉక్కిరిబిక్కిరి?

YS Sisters in the work of demolishing the YCP

YS Sisters in the work of demolishing the YCP

YCP : కుటుంబాన్ని చీల్చి, రాష్ట్రాన్ని నాశనం చేసి ఓ నియంతలా సీఎం జగన్ పాలిస్తున్నారని గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల విరుచుకుపడుతున్నారు. తనపై వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దాడి చేస్తుండడంతో షర్మిల కూడా అదే రేంజ్ లో డైరెక్ట్ గా అన్న జగన్ పై మాటల యుద్ధం చేస్తున్నారు. ప్రతిపక్షాలను మించి సొంత చెల్లె తనపై ఎదురు దాడికి దిగడంతో జగన్ ఉడికిపోతున్నారు. తాను డైరెక్ట్ గా బయటపడకుండా తన టీంతో షర్మిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయిస్తున్నారు.

ఇక షర్మిలకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి తోడయ్యారు. తన తండ్రిని హత్య చేసిన నిందితులకు శిక్ష పడేంత వరకూ తన పోరాటం కొనసాగిస్తానని చెప్పిన సునీతా రెడ్డి రాజకీయంగా వారిని  దెబ్బకొట్టేలా అడుగులు వేస్తున్నారు. వివేకా హత్య కేసులో పోరాటానికి మద్దతుగా నిలిచిన షర్మిలతో కలిసి నడిచేందుకు సునీతా రెడ్డి కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం.. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలువురు అరెస్ట్ అయ్యారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు.

షర్మిలకు తోడుగా రాజకీయ పయనం చేయాలని తన తండ్రిని చంపేసిన హంతకులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని సునీత పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. సునీత లేదా ఆమె తల్లి కడప లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ స్థానం నుంచి మరోసారి అవినాశ్ రెడ్డికే జగన్ రెడ్డి టికెట్ ఖరారు చేస్తారని చెబుతున్నారు. అందుకే ఆయనపై పోటీకి సునీతా రెడ్డి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

ఈక్రమంలో వైఎస్ షర్మిలతో సునీతా రెడ్డి నిన్న ఉదయం ఇడుపులపాయలో భేటీ అయ్యారు. దాదాపు 2గంటల పాటు ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సునీతా రెడ్డి కలువడం ఇదే మొదటిసారి.

ఈ సమావేశంలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగినట్లు సమాచారం. సునీతా రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే వైసీపీకి పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సునీతారెడ్డిపై ప్రజల్లో సానుభూతి ఉండడం, వివేకాకు ప్రజలకు ఉన్న మంచి పేరు సునీతా లాభిస్తుందని అంటున్నారు. ఇక ఆమె పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

ఇక సొంత చెల్లెళ్లు జగన్ పునాదులను కదిలిస్తుండడంతో ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనకు అనుకోని వరంలా మారింది. షర్మిల వ్యాఖ్యలను అవకాశంగా తీసుకుని జగన్ రెడ్డిపై దాడి పెంచే అవకాశం ఉంది. జగన్ పాలనా వైఫల్యాలను జనాలు ముందుంచి, రాబోయే ఎన్నికల్లో ఎవరినీ ఎన్నుకుంటారో తేల్చుకోవాలని కోరనున్నారు. ఇక షర్మిల, సునీతా రెడ్డి కలయిక వైసీపీ శిబిరంలో ప్రకంపనలు రేపుతోంది. ఒకప్పుడు అన్నకు అధికారం రావడానికి అండగా నిలిచిన చెల్లి..ఇప్పుడు అన్నను అధికారం నుంచి దించి వైసీపీ పునాదులు పెకలించే ఆయుధమైనట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version