Vijayasai Reddy : ఒంటరైన విజయసాయిరెడ్డి..పట్టించుకోని జగన్ ?
Vijayasai Reddy : మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మహిళా ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ జరుగుతున్న ప్రచారం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. వైఎస్ జగన్ చుట్టంతా ఇలాంటివారే ఉంటారంటూ ప్రత్యర్థి పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో విజయసాయిరెడ్డి ప్రస్తుతం దిగాలుగా కనిపిస్తున్నారు. తాను ఒంటరి అన్న భావనలో ఉండిపోయారు. తనపై ముప్పేట దాడి జరుగుతున్నా.. ఏ ఒక్కరూ స్పందించకపోవడం.. పార్టీ అండగా లేకపోవడాన్ని ఆయన తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. మామూలుగా అయితే ఆయన కోసం వ్యక్తిగత అనుబంధంతో అయినా చాలా మంది స్పందించే వారు. తమ అధినేతకు ఇష్టం లేకపోవడంతో.. జగన్ మాటను కాదనలేక ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. విజయసాయిరెడ్డికి మద్దతు తెలపవద్దని అంతర్గత ఆదేశాలు ఇవ్వడంతోనే విజయసాయిరెడ్డికి షాక్ తగిలినట్లయింది.
వాస్తవానికి వైసీపీకి విజయసాయిరెడ్డి పిల్లర్ లాంటి వాడు. 2019లో ఆ పార్టీ విజయానికి తెర వెనుక నుంచి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి విజయ సాయి రెడ్డినే. తెలంగాణ పోలీసులను వాడుకునే స్వేచ్ఛను కేసీఆర్ ఇవ్వడంతో అటు సైబరాబాత్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ ను.. ఇటు హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న అంజనీకుమార్ ను ఏక కాలంలో ఉపయోగించుకుని టీడీపీని ఎంత టార్చర్ పెట్టాలో అంత పెట్టారు. ఆ తర్వాత బీజేపీతో సమన్వయం చేసుకున్నారు. మరో వైపు ప్రశాంత్ కిషోర్ టీం మొత్తం ఇచ్చే ప్లాన్లను అమలు పరిచారు. ఇక డబ్బులు ఎవరెవరికి ఎంతెంత చేర్చాలి.. నియోజకవర్గాల్లో ఎలా పంచాలన్నది మొత్తం విజయసాయిరెడ్డి ప్లానే. అందుకే జగన్ గెలుపు ప్రకటన తర్వాత.. విజయసాయిరెడ్డినే మొదట ఆలింగనం చేసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ రూంలోకి ఎంట్రీకి కూడా పర్మీషన్ లేదు.
ప్రభుత్వ ఏర్పాటు తర్వాత విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టి అక్కడ దోపిడీకి ప్రాధాన్యత ఇవ్వడంతో జగన్ పక్కన చేరిన సజ్జల రామకృష్ణారెడ్డి మెల్లమెల్లగా పట్టు దక్కించుకున్నారు. ఆ తర్వాత నుంచి విజయసాయిరెడ్డికి కష్టాలు స్టార్టయ్యాయి. విజయసాయిరెడ్డిని డీ ఫేమ్ చేయడం మొదలుపెట్టారు. పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గించారు. కొన్నాళ్ల పాటు దూరం పెట్టారు. మళ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందే సమావేశాలకు పిలిచారు. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతే. సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంటలిజెన్స్ ను చేతిలో పెట్టుకుని విజయసాయిరెడ్డి ప్రైవేటు వ్యవహారాల గురించి తెలుసుకుని.. అవన్నీ జగన్ ముందు పెట్టడంతోనే ఆయనను దూరం పెడుతున్నారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. అందుకే.. తనపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని విజయసాయిరెడ్డి మథన పడుతున్నారు.