AP Free Bus : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచంటే?

AP Free Bus

AP Free Bus

AP Free Bus : ఏపీలో ఉచిత బస్సు పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తాజా అంచనాల ప్రకారం వచ్చే నెల నుంచి ఉచిత బస్సు సౌకర్యం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరి.. తాజాగా ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఏం చేశారో తెలుసుకుందాం. ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అర్జంట్ గా అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ.. రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. పింఛన్ల పంపిణీకి డబ్బులు లేకపోవడంతో ప్రభుత్వం కొత్త రుణం తీసుకుంది. అందుకే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు కావాలంటే అందుకు ఎంత ఖర్చవుతుంది, ఆర్టీసీతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇలా అన్ని అంశాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసింది. మహిళలు, విద్యార్థులు, హిజ్రాలు బస్సుల్లో నగరం నుంచి గ్రామానికి ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఏపీలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. నిన్న ఇద్దరు సీఎంలు అధికారికంగా భేటీ అయిన తర్వాత.. మరోసారి విడివిడిగా భేటీ అయ్యారు. అక్కడ ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు ఆరా తీశారు. ఈ పథకం అమలుకు షరతులు ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తే.. ఏమీ లేదు… ఆధార్ కార్డు చూపిస్తే జీరో టికెట్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఈ పథకం అమల్లోకి వచ్చిందని, రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, ఆర్టీసీకి కూడా ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. అందుకే ఈ పథకాన్ని ఏపీలో అమలు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నది చంద్రబాబు రేవంత్ కు చెప్పలేదని సమాచారం.  

ఆగస్టు 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. అంటే మరో 15 రోజుల్లో ఈ పథకంపై చర్చలు పూర్తి చేసి మార్గదర్శకాలు సిద్ధమవుతాయని తెలిపారు. ఈ నెలలో ఇంకా 24 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ సమయానికి ఈ పథకం అమలు కోసం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి కావచ్చు. అందుకే ఆగస్టు 1 నుంచి ప్రారంభమైతే మహిళలు ఆనందం వ్యక్తం చేస్తారు. అలా కాకుండా ఇంకా ఆలస్యమైతే మహిళల్లో కోపం పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. తెలంగాణలో వెంటనే అమలు చేసినప్పుడు ఏపీలో ఎందుకు చేయడం లేదని మహిళలు ప్రశ్నించే అవకాశం ఉంటుంది.

TAGS